టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కు.. అందుకే జగన్‌తో స్నేహం!
- IndiaGlitz, [Friday,June 14 2019]
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై ఇప్పటికీ ఎంత వెతికినా కారణాలు మాత్రం తెలియట్లేదు. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు కారణం పార్టీ ఫిరాయింపులేనని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మీకైనా సిగ్గుండాలిగా..!
ఇదిలా ఉంటే.. శుక్రవారం నాడు తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు నిరసనగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ప్రజల ఓట్లుతో గెలిచి పార్టీ మారినోళ్ళు.. కుటుంబాన్ని మార్చరని నమ్మకం ఏంటి? అని ఈ సందర్భంగా ఫిరాయింపు నేతలకు సూటి ప్రశ్న సంధించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షం లేనప్పుడు.. ప్రజలే ప్రతిపక్షంగా మారతారన్న విషయాన్ని నారాయణ గుర్తు చేశారు. ముఖ్యమంత్రే ఫిరాయింపులను ప్రోత్సహించటం సిగ్గుచేటన్నారు. పార్టీలో
చేర్చుకునే వాళ్ళకు లేనప్పుడు.. చేరే వాళ్ళకైనా సిగ్గుండాలని నారాయణ విమర్శలు గుప్పించారు.
టీడీపీ గతే టీఆర్ఎస్‌కు.. జగన్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నా! పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఏపీలో తెలుగుదేశానికి పడిన శిక్షే టీఆర్ఎస్‌కు పడుతుందని నారాయణ జోస్యం చెప్పారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని తప్పుచేశారన్నారు.
రాజీనామా చేయకపోతే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోనన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు.
తనకంటే వయస్సులో చిన్నవాడైన వైఎస్ జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సీపీఐ నేత హితవు పలికారు.
తెలంగాణలో వైసీపీ రాకుండా చూడటానికే కేసీఆర్.. జగన్‌తో స్నేహం చేస్తున్నాడని షాకింగ్ విషయం చెప్పారు. అంతటితో ఆగని ఆయన..
కేసీఆర్ పచ్చి అవకాశవాది అని నారాయణ చెప్పుకొచ్చారు. కాగా.. నారాయణ వ్యాఖ్యలపై అటు టీడీపీ.. ఇటు వైసీపీ, టీఆర్ఎస్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.