జైళ్లో పెడతారా పెట్టుకోండి.. ఏమైతది : కేంద్రంతో ‘‘సై’’ అన్న కల్వకుంట్ల కవిత

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి బయటకు రావడంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. దీంతో కవిత గురువారం మీడియా ముందుకు వచ్చి, బీజేపీపై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రానికి మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుందని.. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందునే ఈడీ వచ్చిందని కవిత ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐతో భయపెట్టించి గెలవాలని చూస్తున్నారని.. ఈడీ వస్తే కచ్చితంగా సమాధానం చెప్తానని ఆమె హెచ్చరించారు. మీడియాకు లీకులు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని..
జైల్లో పెడతామంటే పెట్టుకోవచ్చునంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంత కంటే బీజేపీ ఏం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది:

మోడీ 8 ఏళ్ల పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని.. మోడీ వచ్చే ముందు ఈడీ రావడం సహజమేనంటూ కవిత చురకలు వేశారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఈడీ కేసులు నమోదవుతున్నాయని ఆమె ఆరోపించారు. రాజకీయ పరమైన ఎత్తుగడలో భాగంగానే ఈడీ కేసులు నమోదు చేస్తున్నారని, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతియ్యడానికే మీడియాకు లీకులు ఇస్తున్నారని కవిత ఆరోపించారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా తన పంథా మార్చుకోవాలని, ప్రజలు ఏం చేయగలమో చెప్పి గెలవాలి కానీ ఇలాంటి చర్యలతో కాదని ఆమె హితవు పలికారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంను పట్టించుకోను:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తన పేరును ప్రస్తావించడాన్ని తాను పట్టించుకోనని కవిత తేల్చిచెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని, తనతో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐని ప్రయోగించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ ఆగడాలు ఇక్కడ నడవవని, ఈ విషయాన్ని మోడీ గమనించాలని కవిత చురకలంటించారు.