Kalvakuntla Kavitha : చదువుల తల్లికి కవిత భరోసా... ఎంబీబీఎస్ ఖర్చు తనదేనని హామీ
Send us your feedback to audioarticles@vaarta.com
నిత్యం రాజకీయాలతో బిజీగా వుండటమే కాకుండా ఆపదలో వున్న వారికి ఆసరాగా నిలుస్తూ వుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చదువుల్లో మెరిట్ సాధించినప్పటికీ.. పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్న ఓ సరస్వతి పుత్రికను కవితను నేనున్నానంటూ ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్ గూడకు చెందిన హారిక నీట్లో ర్యాoక్ సాధించారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి నెలకొంది. హారిక కుటుంబ దీనగాథను మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటన సందర్భంగా హారికను కలిసి ఎంబిబిఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు కవిత.
హారికను విద్యార్ధులు స్పూర్తిగా తీసుకోవాలి: కవిత
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని కవిత ప్రశంసించారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. హారిక ఎంబిబిఎస్ చదువులో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని కవిత ఆకాంక్షించారు. కవిత చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో వారు భావోద్వేగానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునందిస్తానని హారిక అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout