తెరాస ప్రచార రథంపై 'రావాలి జగన్ కావాలి జగన్'
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ హైదరాబాద్ మునిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తైంది. ఇక అభ్యర్థులంతా ప్రచారంతో మునిగి తేలుతున్నారు. పగలెనక రాత్రనక తమ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఏ ఎన్నికల్లో అయినా కీలకంగా మారే ప్రచార రథం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి తలనొప్పి తెచ్చిపెట్టింది. గ్రేటర్ ఎన్నికల కోసం ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రచార రథాలను సైతం ప్రత్యేకంగా సిద్ధం చేయించుకుంటున్నారు. తమ పార్టీ రంగులను వేయించి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. కాగా.. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున కొలుకుల జగన్ అనే వ్యక్తి బరిలోకి దిగారు. ఆయన కూడా తన ప్రచార రథాన్ని తమ పార్టీ గుర్తైన గులాబీ రంగుతో సిద్ధం చేయించారు. వాహనాన్ని పూర్తిగా గులాబీ మయం చేసేసి తమ పార్టీ అధినేతల ఫోటోలను ప్రచారం రథంలో పెట్టించారు.
అంతా బాగానే ఉంది కానీ ఓ కాపీ కొట్టి తలనొప్పి తెప్పించుకున్నారు. తన పేరు జగన్ కాబట్టి ప్రచార రథంపై ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అని రాయించుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభ్యర్థి పేరు జగన్ అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది ఏపీ సీఎం జగన్ స్లోగన్ కావడంతో చూసిన వారి దృష్టంతా ఆయన మీదకే వెళుతోంది. అసలు టీఆర్ఎస్ అభ్యర్థిని పట్టించుకునే దిక్కు లేకుండా పోతోంది. టీఆర్ఎస్ కోసం జగన్ ప్రచార రథాలను పంపారంటూ కొందరు.. ఇక్కడ ప్రచార రథాలు తక్కువై ఏపీ నుంచి అద్దెకు తెచ్చారని మరికొందరు మాట్లాడుతున్నారు తప్ప అసలు అభ్యర్థిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments