తమిళనాడులో బీజేపీకి గడ్డు కాలం.. ప్రచారానికి సైతం నో అంటున్న అన్నాడీఎంకే!
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఒక రకంగా రాష్ట్ర గతిని మలుపు తిప్పే ఎన్నికలు. అయితే తమిళనాడులో ద్రవిడ జాతీయవాదం అనేది చాలా బలమైన శక్తిగా పని చేస్తుంటుంది. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలు తాము ఈ వాదాన్ని వీడిందైతే లేదన్నట్టుగా సంకేతాలిస్తున్నాయి. డీఎంకే విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. అన్నాడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఈ పార్టీ ఆర్యుల పార్టీ, హిందీ రాష్ట్రాల పార్టీ అన్న భావన ప్రజల్లో వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో కలిసి అన్నాడీఎంకే నేతలు ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. బీజేపీ మాటేమో కానీ తమ సీట్లకే ఎసరొస్తుందని భయపడుతున్నారు. తమ అభ్యర్థి తరుఫున బీజేపీ నేతలు ప్రచారానికి వస్తామన్నా కూడా తమ పార్టీ జెండాలు లేకుండా రావాలని ఖరాఖండీగా అన్నాడీఎంకే నేతలు చెబుతున్నట్టు తెలుస్తోంది.
రాత్రి వేళ మాత్రమే..
ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి తరుఫున ప్రచారానికి ఏదో పరిమిత సంఖ్యలోనో లేదంటే అసలు హ్యాండ్ ఇవ్వడమో చేస్తున్నారు. ఒకవేళ వెళ్లినా కూడా రాత్రి వేళ వెళుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా ముస్లిం ఏరియాకు అన్నాడీఎంకే నేతలు ప్రచారానికి వెళితే తమ వెంట బీజేపీ నేతలు రాకూడదని స్పష్టం చేస్తున్నారట. ఒక నియోజకవర్గంలో అయితే బీజేపీ నేత పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అన్నాడీఎంకే నేతలు ప్రచారం వైపుకు చూడటం లేదని సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీ అభ్యర్థులు సైతం అన్నాడీఎంకే కండువాలతో పోటీ చేయడం. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు కనీసం తమ జాతీయ నేతలైన నరేంద్ర మోదీ, అమిత్ షాల ఫోటోలు పట్టుకుని జనాల్లోకి వెళ్లడం లేదు. జయలలిత ఫోటోనే నమ్ముకుని, అన్నాడీఎంకే జెండాలతోనే ప్రజల్లోకి వెళుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి బీజేపీతో పొత్తు అన్నాడీఎంకేకి మరింత ఇబ్బందికరంగా మారిందని సమాచారం.
ఆ పార్టీ ఓట్లు చీల్చే అవకాశం..
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలకూ ఇవి కీలకమైన ఎన్నికలే. సొంతబలంపై ఆధారపడి బరిలోకి దిగారు. ఒకవైపు స్టాలిన్‌కు ఇంటిపోరు మాత్రమే ఇబ్బందికరంగా ఉంది. తన సోదరుడు అళగిరి ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఈ ఇంటిపోరును దాటేస్తే చాలు.. కానీ అన్నాడీఎంకేకు అలా కాదు.. జయలలిత లేరు.. ఆమె నెచ్చెలి శశికళ సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు రజినీకాంత్ రాజకీయాల్లో వస్తారనుకున్నా నిరాశే ఎదురైంది. నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం).. సీమన్ నేతృత్వంలో తమిళ జాతీయవాదమే ఊపిరిగా ఏర్పడింది. ఈ పార్టీతో పాటు.. నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే), శశికళ బంధువు టీటీవీ దినకరన్ పెట్టిన ఏఎంఎంకే పార్టీలు ప్రధాన పార్టీల ఓట్లను చీలుస్తాయన్న అంచనాలున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తు.. పదేళ్ల ప్రభుత్వ-వ్యతిరేకత ఇవన్నీ అన్నాడీఎంకేకు ప్రతికూలంగా మారాయి. ఇక స్టాలిన్‌కు సర్వేల సరళి చూస్తే డీఎంకేకు ఆధిక్యం, విజయం ఖాయం. అన్నాడీఎంకే తగ్గుతుంది కానీ రంగం నుంచి పూర్తిగా చెదిరిపోదని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout