Chandrababu Naidu:బాబు గారి కామెడీ : ఇంజినీరింగ్ చదవాలంటే బైపీసీ చేయాలట ... హైటెక్ సీఎం, విజనరీ లీడర్ నాలెడ్జ్ ఇది

  • IndiaGlitz, [Wednesday,August 16 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు వేదికల మీదకు వెళ్లినా తరచుగా ఓ మాట చెబుతూ వుంటారు. తాను గొప్ప విజన్ వున్న నాయకుడిని.. ఆర్ధిక సంస్కరణలను ముందు తానే అందిపుచ్చుకున్నానని, ఐటీ సత్తాను ముందే ఊహించి హైటెక్ సిటీ కట్టానని, అది చేశా, ఇది చేశానంటూ అంటారు. బిల్‌గేట్స్‌ను ఒప్పించానని, ఎంతోమంది మేధావులకు ప్రజేంటేషన్ ఇచ్చేవాడినని ప్రగల్బాలు పలుకుతూ వుంటారు. వినేవాడు వుంటే.. అన్నట్లుగా చంద్రబాబు మాటలు వుంటాయి. టీడీపీ వీరాభిమానులు, పచ్చ చొక్కాలు బాబు గారి సత్తా గురించి ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తూ వుంటారు.

విజన్ 2047 ఈవెంట్‌లో చంద్రబాబు పరువు పాయే :

అలాంటి చంద్రబాబు నాయుడి మేథస్సు, సత్తా ఏంటో నిన్న తేలిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లో రెండున్నర కిలోమీటర్ల పాటు ఆయన జాతీయ సమైక్యతా పాదయాత్ర చేశారు. అది ముగిసిన వెంటనే ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశం , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎలా వుండాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనేదానిపై ప్రజంటేషన్ ఇచ్చారు. డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ అనే విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు టంగ్ స్లిప్ అయ్యారు. ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్‌లో బైపీసీ చేయాలట. ఈ మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

విజన్ గురించి చెబుతూ టంగ్ స్లిప్ :

పిల్లలు ఇంజనీరింగ్ చేయాలనుకోవడం తల్లిదండ్రుల 20 ఏళ్ల కల అన్న చంద్రబాబు.. ఆ కలే విజన్ అంటూ పేర్కొన్నారు. ఆ విజన్ నెరవేర్చుకునేందుకు పిల్లలను చిన్నప్పటి నుంచే ఏ స్కూల్‌లో వేయాలి, ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలనే దానిపై అవగాహన పెంచుకుంటారని తెలిపారు. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలంటూ చెప్పుకొచ్చారు బాబు గారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బైపీసీ చదివితే ఏమవుతారో తెలియదా :

నిజానికి ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్‌లో చేయాల్సింది ఎంపీసీ. ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. బైపీసీ సైన్స్‌కు చెందిన గ్రూపు . మరి మూడు సార్లు ప్రతిపక్షనేతగా, మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి.. తనను తాను సీఈవోగా అభివర్ణించుకున్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీనిని బట్టి చంద్రబాబు ఏ రేంజ్‌లో చదువుకున్నారో , ఆయన మేథస్సు తెలివి తేటలు ఏ స్థాయిలో వున్నాయోనంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

బీకాంలో ఫిజిక్స్ చదివానన్న టీడీపీ నేత :

అయితే యథారాజా తథా ప్రజా అన్నట్లు నాయకుడే ఇలా వుంటే టీడీపీ నేతలు ఇంకేలా వున్నారో అన్న సందేహం కలగక మనదు. అందుకు తగ్గట్లుగానే కొందరు పచ్చపార్టీ నేతలు గతంలో పలు ఇంటర్వ్యూలలో నోటికొచ్చినట్లు మాట్లాడి తమ మేథస్సును బయట పెట్టేసుకున్నారు. గతంలో ఓ టీడీపీ నేత బీకాంలో ఫిజిక్స్ చదివానని.. బీకాంలో మ్యాథ్స్ చేశానని మరొకరు ఇలా తమ ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ను బయటపెట్టుకుని తమ పరువుతో పాటు పార్టీ పరువును గంగపాలు చేశారు. ఇప్పుడేమో ఏకంగా టీడీపీ అధినేత అడ్డంగా దొరికిపోయారు.