కూచిపూడి నృత్య రూపకం 'మీనాక్షి కల్యాణం'తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన త్రివిక్రమ్ సతీమణి సౌజన్యా శ్రీనివాస్!
Send us your feedback to audioarticles@vaarta.com
కూచిపూడి నృత్యకారిణి సౌజన్యా శ్రీనివాస్ (దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి), ఆమె బృందం ప్రదర్శించిన 'మీనాక్షి కల్యాణం' అనే నృత్య రూపకానికి వేదిక అయ్యింది హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూపకాన్ని సమర్పించాయి. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, సీనియర్ నటుడు-రచయిత తనికెళ్ల భరణి, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, మామిడి హరికృష్ణ (తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్), సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వసంతలక్ష్మి నరసింహాచారి, సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు.
భమిడిపల్లి నరసింహమూర్తి (బ్నిం) రచించిన ఈ నృత్య రూపకానికి పేరుపొందిన నాట్యకారుడు పసుమర్తి రామలింగశాస్త్రి నృత్యాలు సమకూర్చగా, డీవీఎస్ శాస్త్రి సంగీతం అందించారు. మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం వెనుక ఉన్న అద్భుతమైన గాథను ఈ రూపకం ద్వారా ప్రదర్శించారు. పార్వతిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన భక్తురాలు విద్యావతికి పుట్టిన మీనాక్షిగా సౌజన్యా శ్రీనివాస్ ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
సంప్రదాయం, సాంకేతిక నైపుణ్యం చక్కగా కలగలసిన ఆ ప్రదర్శనకు లైవ్ మ్యూజిక్, కాస్ట్యూమ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ మరింత వన్నె తెచ్చాయి. గోపిక పూర్ణిమ, పసుమర్తి పద్మ అందించిన సుమధుర గాత్రం రూపకానికి అతికినట్లు సరిపోయింది. సుందరేశ్వరునిగా, మీనాక్షిగా జన్మించడానికి ముందు శివపార్వతులు చేసే నాట్యం చూస్తూ ఒకవైపు పరవశత్వానికీ, మరోవైపు భావోద్వేగానికీ లోనయ్యారు ప్రేక్షకులు.
మీనాక్షి ఒక యోధురాలిగా మారే వైనం, సుందరేశ్వరస్వామిని ఆమె పెళ్లాడే ఘట్టం చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపించింది. తమిళనాడుకు చెందిన పలు జానపద సంప్రదాయ రీతుల్లోని సౌందర్యాన్ని ప్రదర్శించడానికి వచ్చిన అవకాశాన్ని ఈ రూపకం చక్కగా ఉపయోగించుకుంది. మీనాక్షి కల్యాణం నృత్యరూపకం నయనానందకరంగా సాగింది. నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి దర్శకత్వంలో సౌజన్య కళాకారుల బృందం చక్కటి హావభావాలతో నృత్యం చేసి కళాప్రియులను మంత్రముగ్ధుల్ని చేశారు. మీనాక్షి పాత్రలో ఆమె అద్భుతమైన అభినయం చూపారు.
రూపకం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ, "సౌజన్యా శ్రీనివాస్ గారు ప్రదర్శించిన 'మీనాక్షి కల్యాణం'ను స్టేజి మీద చూసే అవకాశం కలగడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. రచయిత భమిడిపల్లి నరసింహమూర్తి గారికీ, నాట్యకారులు పసుమర్తి రామలింగ శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పసుమర్తిగారు నృత్యాలు సమకూర్చిన నాట్య ప్రదర్శన చూడటం ఇది నాకు రెండోసారి. ఈ వేదిక (శిల్పకళావేదిక)పై సాధారణంగా సినిమా ఫంక్షన్స్ జరుగుతుంటాయనుకుంటాను. అయినప్పటికీ ఈ నృత్య రూపకానికి ప్రేక్షకుల స్పందన చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన మూలాలు, సంప్రదాయాలను గుర్తుంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కూచిపూడి లాంటి సంప్రదాయ కళలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాలన్నారు.
ఈ సందర్భంగా మొత్తం బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీనాక్షి పాత్రలో సౌజన్య చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్లు అనిపించిందన్నారు.ఆ దేవుళ్లే మన ముందుకు వచ్చి నాట్యం చేశారా అనేటటువంటి అనుభూతి కలిగింది" అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ, "నాకు మీనాక్షి, సుందరేశ్వరస్వామి వార్ల కథ చాలా ప్రతీకాత్మకంగా అనిపించింది. చూసేవారి కళ్లని బట్టి సౌందర్యం ఉంటుందని చెప్పే చక్కని దృశ్య రూపకం ఇది. ఒకరి అంతర్గత సౌందర్యాన్ని మరొకరు గుర్తించగలిగితే, జీవితమే ఒక వేడుకలా అవుతుంది. నిజమేమంటే స్టేజి మీద నా జీవిత భాగస్వామి ప్రదర్శన ఇస్తుంటే, ప్రేక్షకుల్లో ఒకరిగా నేను 'మీనాక్షి కల్యాణం'ను చూడటం. కూచిపూడి కానీ మరో నాట్య విధానం కానీ.. అంతిమంగా అది ఒక కథని చెప్పే కళ. డాన్స్‌లోని టెక్నిక్ ప్రేక్షకులకు సంబంధించింది కాకపోవచ్చు కానీ, దాన్ని ఆస్వాదించే అనుభవం మాత్రం ప్రేక్షకులది. ఈ విషయంలో సౌజన్య, ఆమె బృందం తమ ప్రదర్శనతో మనల్ని అబ్బురపడేట్లు చేశారు. అందుకే ఇప్పటికీ కూచిపూడి నిలిచివుంది, రాబోయే కాలంలోనూ నిలిచివుంటుంది. సినిమాల్లోనూ కెమెరా ముందు మేం చేసేది కూడా.. ఒక కథ చెప్పడమే. పసుమర్తి రామలింగశాస్త్రి గారు నా భార్యకు గురువుగా కంటే కూడా, మా కుటుంబంలోని వ్యక్తి లాంటివారు. ఇంతకంటే నేనేం అనగలను? నా జీవితంలోని ఇద్దరు అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన పవన్ కల్యాణ్ గారు ఒకరు నా పక్కన కూర్చుంటే, ఇంకొకరు సౌజన్య స్టేజి మీద ఉన్నారు" అని చెప్పారు.
మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, "సౌజన్యా శ్రీనివాస్ గారు, ఆమె బృందం ఇచ్చిన చిరస్మరణీయ ప్రదర్శన ఈ సాయంత్రం వేళ మనల్ని అందర్నీ పరవశింపజేసింది. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి 'భీమ్లా నాయక్' దాకా తన చక్కని అభినయాలతో ప్రజానీకంలో యూత్ ఐకాన్‌గా పేరుపొందిన పవన్ కల్యాణ్ గారు మనమధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఒక రచయితగా, దర్శకునిగా త్రివిక్రమ్ గారికి ఉన్న పేరుప్రఖ్యాతులు మరెవరికీ లేవు. పసుమర్తి రామలింగశాస్త్రి గారి నృత్య దర్శకత్వం, ప్రత్యేకించి తమిళనాడుకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలను ఆయన హైలైట్ చేసిన విధానం ఎంతైనా ప్రశంసనీయం" అన్నారు.
పసుమర్తి రామలింగశాస్త్రి మాట్లాడుతూ, "ఎన్నో ఏళ్లుగా నేను కూచిపూడి సంప్రదాయం మనుగడ గురించి ఆందోళన చెందుతూ వస్తున్నాను. పార్వతీదేవి లేదా ఆమె అవతారాల్లో ఒకదానిపై నృత్య రూపకం చెయ్యాలని అనుకుంటూ వచ్చాను. ఒకరోజు మధుర మీనాక్షిపై ప్రదర్శన ఇస్తే బాగుంటుందనిపించి, సౌజన్యతో మాట్లాడాను. కొవిడ్ -19 మా ప్లాన్స్‌ను అడ్డుకున్నప్పటికీ, ఈ రూపకాన్ని కలిసి తీసుకురావడంలో అవసరమైన సపోర్టును ఆమె అందించింది. వేదిక మీదకు పార్వతి రావడానికి చాలా సమయం పట్టిందనుకోండి. మీనాక్షి కల్యాణంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసిన సౌజన్యకూ, ఆమె బృందంలోని నృత్యకారిణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా" అని చెప్పారు.
అనిందిత మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు చుక్కపల్లి సురేష్, కె. సతీష్‌చంద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments