Chiranjeevi : త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్ .. అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు..!!

  • IndiaGlitz, [Tuesday,October 03 2023]

ఆసక్తికరమైన కథలకు, పంచ్ డైలాగ్‌లకు పెట్టింది పేరు త్రివిక్రమ్. ఆయన కలం నుంచి వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. ఆయన డైలాగ్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ వుంది.. అందుకే త్రివిక్రమ్‌ను గురూజీ అని పిలుచుకుంటూ వుంటారు. ఇక పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో, డ్యాన్స్‌తో ప్రేక్షకులతో విజిల్స్ వేయించడంలో చిరంజీవి ఫేమస్. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్‌ను షేక్ చేస్తోంది.

ఖైదీకి సీక్వెల్‌గా చిరు-త్రివిక్రమ్ మూవీ :

మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం త్రివిక్రమ్‌కు ఒకసారి వచ్చింది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన జై చిరంజీవ సినిమా కోసం త్రివిక్రమ్ మాటలు రాశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు.. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పి ఆయన మెగాస్టార్ కావడానికి బాటలు వేసిన ‘‘ఖైదీ’’కి సీక్వెల్ అట. ఈ సినిమా ఎండ్‌లో చిరు ఓ డైలాగ్ చెబుతారు.. ‘‘పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం మరో జన్మ ఎత్తాతా.. అప్పుడు కలుద్దాం’’ అంటూ ఖైదీని ముగిస్తారు. ఇప్పుడు ఈ పాయింట్‌నే స్టోరీ లైన్‌గా తీసుకుని ఖైదీకి సీక్వెల్ తెరకెక్కించనున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి మెగా కాంపౌండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

త్రివిక్రమ్, చిరు ఇద్దరూ బిజీయే :

ఇకపోతే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో గుంటూరు కారం తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కూడా త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వుంది. ఈ రెండు సినిమాల గ్యాప్‌లోనే మెగాస్టార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని గురూజీ భావిస్తున్నారట. అటు మెగాస్టార్ కాల్షీట్లు కూడా బిజీగా వున్నాయి. ఆయన ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. బింబిసార ఫేం వశిష్టతో ఒక సినిమా. కళ్యాణ్ కృష్ణతో మరో సినిమా చేయనున్నారు.