close
Choose your channels

త్రివిక్రమ్ నాకు కొత్త బలాన్నిచ్చారు: అల్లు అర్జున్

Saturday, January 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్రివిక్రమ్ నాకు కొత్త బలాన్నిచ్చారు: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకొని, టాలీవుడ్ లోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో జరిపిన సంభాషణ విశేషాలు.

ఇదివరకటి కంటే ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తున్నారు. ఆ రహస్యం ఏమిటి?

కారణం నా హెయిర్ స్టైల్. ఇంత లాంగ్ జుట్టు ఇదివరకు పెంచలేదు. ఈ సినిమా చేసిన 8 నెలలు నేను హ్యాపీగా ఉన్నాను. బయటకు కూడా అదే కనిపిస్తుందనుకుంటాను.

ఇది బాలీవుడ్ ఫిల్మ్ 'సోను కే టిటు కీ స్వీటీ'కి రీమేక్ అంటూ ప్రచారంలోకి వచ్చింది. నిజమేనా?

'సోను కే టిటు కి స్వీటీ' అనేది గీతా ఆర్ట్స్ లో రీమేక్ చేద్దామని అడిగారు. చాలామంది అది నాకోసమని అనుకున్నారు. అయితే అది నా కోసం కాదు. దాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందా అని నేను పర్సనల్ గా ఆలోచించా. ఆ టైంలో త్రివిక్రమ్ గారు, నేను కలిసి ఒక స్టోరీ అనుకున్నాం. రెండు స్టోరీల్లో మేమనుకున్నదే బెటర్ అనిపించింది. అందుకే 'సోను కే టిటు' జోలికి వెళ్లకుండా ఈ స్టోరీతోటే ముందుకెళ్లాం.

ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యాలని ఎందుకనుకున్నారు?

త్రివిక్రమ్ గారు, నేను కలిసి చేసిన 'జులాయి'లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటే, 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఎమోషన్ ఎక్కువ డామినేట్ అయ్యి, ఎంటర్టైన్మెంట్ తక్కువ అయ్యింది. దాంతో మళ్లీ సినిమా చేసినప్పుడు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చెయ్యాలని అప్పుడే ఇద్దరం అనుకున్నాం. అనుకోకుండా నా చివరి మూడు సినిమాలు 'సరైనోడు', 'డీజే', 'నా పేరు సూర్య' కొంచెం సీరియస్ సినిమాలు అయ్యాయి. నాక్కూడా 'రేసుగుర్రం' లాంటి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చెయ్యాలని ఉంది. త్రివిక్రమ్ గారు 'అరవింద సమేత' లాంటి సీరియస్ సినిమా తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చెయ్యాలనుకున్నారు. ఆయన దగ్గర 'అల వైకుంఠపురములో' స్టోరీ ఉంది. ఆ కథను ఆయన నాకెప్పుడో చెప్పారు. అది బాగుంటుందని అనుకున్నాక, దాన్ని డెవలప్ చేశారు. నేను ఇంతదాకా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పుడూ చెయ్యలేదు. నాకీ జోనర్ కొత్త. అందులోనే హీరోయిజం, యాక్షన్ కూడా బాగా కుదిరాయి. అలాగే పాటలు కూడా.

ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తో మూడు సినిమాలు చేశారు. త్రివిక్రమ్ తో పనిచెయ్యడం సౌకర్యంగా ఉంటుందనా?

నా చివరి 10 సినిమాల్లో 3 త్రివిక్రమ్ గారితోనే చేశాను. ఆయనేమో నేను 10 సినిమాలు చేస్తే, వాటిలో 3 మీతోనే చేశాను అని ఆయనంటున్నారు. కొన్నిసార్లు ఒక హీరోకి, ఒక డైరెక్టర్ కి ఒక రిథం సెట్టవుతుంది. పాత రోజుల్లో చిరంజీవి గారికీ, కోదండరామిరెడ్డి గారికీ బాగా సెట్టయింది. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అలా కలిసి చాలా సినిమాలు చెయ్యగల కెమిస్ట్రీ త్రివిక్రమ్ గారికీ, నాకూ మధ్య ఉంది. మేం ఒకళ్లనొకళ్లం బాగా అర్థం చేసుకుంటాం. ఆయనతో నాకంత సౌకర్యంగా ఉంటుంది కాబట్టే 3 సినిమాలు చెయ్యగలిగాను.

ఆయనతో మూడు సినిమాలు చెయ్యడం ఒక యాక్టర్ గా మీకు ఉపయోగపడిందా?

మూడు సినిమాల్లో త్రివిక్రమ్ గారి తో పనిచెయ్యడం వల్ల ఒక యాక్టర్ గా ఎదగడానికి నాకు కచ్చితంగా ఉపయోగపడిందని భావిస్తాను. ప్రతి డైరెక్టర్ ఒక నటుడి నుంచి కొత్తగా ఏదో ఒకటి వెలికి తీస్తారు. 'జులాయి'కి ముందు నేను 'బద్రినాథ్' చేశాను. అప్పటివరకు నేను చేసినవి ఒకెత్తు. 'జులాయి' నుంచి చూస్తే నా సినిమాలు మెచ్యూర్డ్గా, వేరే విధంగా ఉండటం కనిపిస్తుంది. యాక్టర్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ను రాబట్టడంలో త్రివిక్రమ్ గారు ఎక్స్పర్ట్. 'జులాయి'లో అది మీకు కనిపిస్తుంది. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో మరింత బాగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలోనూ పర్ఫార్మెన్స్ పరంగా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారనే విషయం తెలుస్తుంది. ఇందులో నేచురల్, రియల్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించా. ప్రతి సినిమా ఎదగడానికి మనకు లభించిన ఒక అవకాశం. కొంతమంది దర్శకులు మన బలాల్ని ఉపయోగపెడ్తారు. కొంతమంది దర్శకులు మనకు కొత్త బలాల్నిస్తారు. మనకు కొత్త బలాన్నిచ్చే కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ గారొకరు. మనల్ని మనం బెటర్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడే వ్యక్తి ఆయన.

ఈ సినిమాకు ముందు తీసుకున్న గ్యాప్ లో ఏం నేర్చుకున్నారు?

ఒక మనిషి గ్యాప్ తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు. అవి చిన్న చిన్న సింపుల్ విషయాలే కావచ్చు కానీ గొప్ప విషయాలు తెలుసుకుంటాడు. ఇంక లైఫ్ లో గ్యాప్ తీసుకోకూడదనే గొప్ప విషయం తెలుసుకున్నాను. ఒకటిన్నర సంవత్సరం సినిమా లేకపోయినా నా విషయంలో ఫ్యాన్స్ కనపర్చిన ఎంతూసియాజం మాత్రం, ప్రేమ మర్చిపోలేనివి. నా లైఫ్ లో వాళ్ల కోసం డెడికేట్ చేసినా అది వర్త్ అనిపించింది. చెప్పాలంటే ఈ మొత్తం గ్యాప్ ను నేను ఫీల్ కాకుండా చేసింది నా ఫ్యాన్సే. నన్ను ప్రేమించే వ్యక్తులు ఇంతమంది ఉన్నారనే విషయం ఈ గ్యాపే తెలియజేసింది. అంతేకాదు.. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంటారనే విషయం నాకు తెలియజేసింది.

ఇందులో మీ క్యారెక్టర్ ఏమిటి?

వైకుంఠపురం అనే ఇల్లుంది. ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. వాళ్ల మధ్య జరిగిన సంఘటనలే ఈ సినిమా. ఈ సినిమాలో నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చేశాను. పూజా హెగ్డే బాస్ గా ఉన్న ఆఫీసులో పనిచేస్తుంటాను. నాకూ, మా నాన్నకూ పడదు. మా నాన్నగా మురళీశర్మ చేశారు. వైకుంఠపురం అనే ఒక పెద్ద ఇంటికీ, మాకూ ఉన్న కనెక్షన్ ఏమిటనేది సినిమాలో చూడాలి.

సంక్రాంతి పోటీపై మీ అభిప్రాయమేమిటి?

సంక్రాంతి పోటీ అనేది యుగయుగాల నుంచీ ఉంది. దశాబ్దాల నుంచీ ఈ పండుగకు పెద్ద సినిమాలు వస్తూనే ఉంటున్నాయి. ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసే ఏ ప్రొడ్యూసర్ అయినా సోలో రిలీజే కోరుకుంటాడు. అలా వస్తే చాలా డబ్బులొస్తాయ్. సంక్రాంతికి రెండు మూడు సినిమాలైనా ఎందుకొస్తాయంటే, మిగతా రోజుల్లో సోలో రిలీజ్ కు వచ్చిన దానికంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి. అందుకే ఎవరూ ఈ సీజన్ ను మిస్ చేసుకోవాలని అనుకోరు. అన్ని సినిమాలకూ ఈ పండుగకు చోటుంటుంది. అన్నీ ఆడాలని కోరుకుంటున్నా. మా సినిమాతో పాటు 'దర్బార్', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎంత మంచివాడవురా' కూడా ఆడాలని ఆశిస్తున్నా.

త్రివిక్రమ్ నాకు కొత్త బలాన్నిచ్చారు: అల్లు అర్జున్

'సామజవరగమన' సాంగ్ వెనుక ఉన్న కథేమిటి?

హైదరాబాద్ లో కుర్రాళ్లు తెలుగు పాటలు బాగా ఇష్టపడుతున్న విషయం తెలిసింది. తెలుగు రాక్ బ్యాండ్స్ కూడా తయారయ్యాయి. ఆ విషయం త్రివిక్రమ్ గారితో పంచుకున్నా. ఆ జోనర్లో ఒక పాట పెడితే క్లిక్ అవుతుందని చెప్పా. ఆ టెంపో తో తమన్ ఒక ట్యూన్ చేస్తే, దానికి త్రివిక్రమ్ గారు 'సామజవరగమన' అనే ఒక పదం రాశారు. ఆ తర్వాత సీతారామశాస్త్రిగారు ఆ పాట రాశారు. అది చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత 20 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని లైవ్ పర్ఫార్మెన్స్ లాగా షూట్ చేసి రిలీజ్ చేశాం. ఆ ఐడియా త్రివిక్రమ్ గారిది . ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.

సినిమా విడుదలకు మూడు నెలల కంటే ముందే ఆ సాంగ్ రిలీజ్ చెయ్యాలనేది ఎవరి ఆలోచన?

అది నా ఆలోచన. అంత ముందుగా సాంగ్ రిలీజ్ చేద్దామని నేననగానే అందరూ భయపడ్డారు. హిందీ సినిమాల్లో అందరూ దాదాపు 4 నెలల ముందే సాంగ్స్ రిలీజ్ చేస్తుంటారు. మనకి కూడా ఆ కల్చర్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక పాట వ్యాప్తి చెందాలంటే టైం తీసుకుంటుంది. సినిమా అయితే ఒకటే స్టేట్ కాబట్టి పది, పదిహేను రోజుల్లో వ్యాప్తి చెందుతుంది. కానీ సాంగ్ అలా కాదు. అది జనాల్లోకి బాగా వెళ్లడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. అందుకే అంత ముందుగా ఆ సాంగ్స్ విడుదల చేశాం. అందుకే అవి అంత బాగా హిట్టయ్యాయి. 'సామజవరగమన'కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే పేరు కూడా వచ్చింది.

మలయాళంలోనూ క్రేజ్ తెచ్చుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?

అద్భుతంగా ఫీలవుతున్నా. అక్కడ నాకు మామూలు గౌరవం లభించలేదు. ఇప్పటివరకూ ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను దుబాయ్ తీసుకెళ్లి ఒక గొప్ప పురస్కారాన్ని ఇచ్చారు. దాన్ని అందుకున్న తొలి మలయాలేతర వ్యక్తిని నేను. అలాగే కేరళలో బోట్ రేస్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది. దానికి అక్కడి గవర్నర్తో పాటు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడ్ని నేనే. అది నాకొక్కడికి లభించిన గౌరవం కాదనీ, మన తెలుగువాళ్లందరికీ లభించిన గౌరవమనీ నాకు అనిపించింది.

మీ పిల్లల్ని షూటింగ్ కు తీసుకెళ్తుంటారా?

అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాను. దానికో రీజన్ ఉంది. ఇదివరకు జనరేషన్ వాళ్లు పిల్లల్ని షూటింగ్ కు తీసుకెళ్తే పాడైపోతారనే ఫీలింగ్తో ఉండేవాళ్లు. పిల్లలకు సినిమాలు కూడా చూపించేవాళ్లు కాదు. రియాలిటీకి దూరంగా పెట్టేవాళ్లు. అది నాకు డబుల్ స్టాండర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది నేను చేసే పని. నన్ను ఈ స్థాయికి తెచ్చింది సినిమాయే. నాన్న ఏం చేస్తుంటాడనే విషయం నా పిల్లలకు తెలియాలి, నా లైఫ్ ఎలా ఉంటుందో తెలియాలి. అందుకే వాళ్లను తీసుకెళ్తుంటాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment