జీవితంలోని ఏడు రంగులనూ ‘రంగ్ దే’ చూపిస్తుంది: త్రివిక్రమ్
Send us your feedback to audioarticles@vaarta.com
'రంగ్ దే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగింది. యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేశ్ జంటగా ఈ చిత్రం రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. చిత్ర నాయకా, నాయికలు నితిన్, కీర్తి సురేష్, సుప్రసిద్ధ నిర్మాత, హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత సుధాకర్‌రెడ్ది, నిర్మాత ఠాగూర్ మధు, చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి,సీనియర్ నటుడు వీకే నరే్‌ష్, రోహిణి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీమణి, గాయని మంగ్లీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ పాట చూస్తే కళ్లు చెమర్చుతాయి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘‘అన్ని జంతువులు నవ్వలేవు. మనిషి మాత్రమే నవ్వగలడు. అలాగే జంతువులకు ఏ వస్తువైనా బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తుంది. మనుషులకు మాత్రమే ఏడురంగులను చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది. సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఇందులో నాకు బాగా నచ్చిన పాత్రలు అర్జున్, అను. ఎలాంటి సందర్భంలో అయినా ఓ మంచి పాటను తీసుకురాగలిగే సత్తా దేవిశ్రీ ప్రసాద్‌కు ఉంది. భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో దేవీ కూడా ఒకరు. ఇందులో ‘ఊరంతా చీకటి’ పాట థియేటర్‌లో చూస్తే ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతాయి’’ అని అన్నారు.
ఫ్లైట్‌లో కలిసినప్పుడు కథ విన్నా..
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలకు నేను సంగీతం అందించాలి. మ్యూజిక్ టూర్స్‌లో ఉండడం వల్ల డేట్స్ కుదరలేదు. ఈ సినిమా గురించి ఫ్లైట్‌లో కలిసినప్పుడు ఓ గంట కథ చెప్పారు. అలా ‘రంగ్ దే’ కుదిరింది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ స్టోరీ ఇది. నితిన్ చేసిన సినిమాల్లో డిఫరెంట్ సినిమా ఇది’’ అని అన్నారు. గేయ రచయిత శ్రీమణి మాట్లాడుతూ ‘‘తొలిప్రేమ నుంచి వెంకీ అట్లూరితో జర్నీ చేస్తున్నా. పాటలకు ఆయనిచ్చే సందర్భాలు బావుంటాయి. అందుకే చక్కని సాహిత్యం అందించగలిగా. ఇందులో అన్ని పాటలు నేనే రాశా. 'జులాయి' సినిమా నుంచి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో ట్రావెల్ చేస్తున్నా. మంచి అవకాశాలిచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న నాగవంశీగారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.
మేం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం..
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘‘నితిన్, కీర్తి ఈ కథ అంగీకరిస్తారని అనుకోలేదు. అర్జున్, అను పాత్రలకు ప్రాణం పోశారు. మేం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. లాక్‌డౌన్‌లో నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేనిది. దేవిగారిని ఓ ఫ్యాన్‌గా కలిశా. ఆయన మాత్రం నాకు ఫ్రీడమ్ ఇచ్చి కావలసినట్లు సంగీతం ఇచ్చారు. పీసీ శ్రీరామ్‌గారు సినిమా అంగీకరించడం నా అదృష్టం. నటీనటులు, సాంకేతిక నిపుణులు ద బెస్ట్ ఇచ్చారు. వెన్నెల కిషోర్, అభినవ్ కామెడీ చక్కగా పండుతుంది. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు ఇచ్చిన సపోర్ట్ మరువలేను’’ అని అన్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘‘అను పాత్ర చేయగలనని నమ్మిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో నా మూడో సినిమా ఇది. హ్యాట్రిక్ అవుతుందని ఆశిస్తున్నా. నితిన్‌తో నా కెమిస్ట్రీ బావుంటుంది’’ అని అన్నారు.
నితిన్ తప్ప మరెవరూ సూట్ అవరు..
సీనియర్ యాక్టర్ నరేష్ మాట్లాడుతూ ‘‘ఒక్క ట్రైలర్.. రెండు డైలాగ్‌లతో వందకు పైగా మెసేజ్‌లు వచ్చాయి. అంతగా ప్రేక్షకుల్ని ట్రైలర్ ఆకట్టుకుంది. దీన్ని బట్టి వెంకీ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేశారో తెలుస్తుంది. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్‌తో బ్యూటిఫుల్ కాక్‌టైల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నితిన్ తప్ప మరెవరూ ఈ సినిమాకి సూట్‌కారు. కీర్తి దక్షిణ భారతదేశం గర్వంచదగ్గ నాయిక’’ అని అన్నారు. నటి రోహిణి మాట్లాడుతూ ‘‘రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని సెలక్టివ్ సినిమాలు చూడాలనుకుంటాం. ఆ కోవకు చెందిన సినిమా ఇది. ప్రేమకథని పీసీ శ్రీరామ్ చూపించినంత అందంగా ఎవరూ చూపించలేరు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. అను పాత్రను కీర్తి తప్ప ఎవరూ చేయలేరు’’ అని అన్నారు.
ఇండస్ట్రీలో ఆ ఇద్దరూ నాకు రెండు కళ్లు..
హీరో నితిన్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నా వయసు 24 ఏళ్లు. నిజంగా నా వయసు 36 ఏళ్లు. దర్శకుడు కథ చెప్పినప్పుడు నా వయసుని జనాలు అంగీకరిస్తారా అన్న అనుమానం వచ్చింది. పీసీ శ్రీరామ్ డిఓపీ అనగానే ఆయన బాగా చూపిస్తారనే నమ్మకంతో ధైర్యం వచ్చింది. 'ఇష్క్' తర్వాత ఆయనతో మరోసారి పని చేయడం హ్యాపీగా ఉంది. డీఎస్‌పీ డైమండ్స్ లాంటి పాటలిచ్చారు. కీర్తి సురేశ్ అనగానే 'మహానటి' గుర్తొస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఆమె మహా నాటు, మహా నాటీ. ఈ కథకు ఆమె పెద్ద ఎసెట్. దర్శకుడితో పన్నెండేళ్ల పరిచయం ఉన్నా మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికి కుదిరింది. చాలా సెన్సిబుల్‌గా ఈ కథను తెరకెక్కించాడు. ఈ బ్యానర్‌లో మూడో సినిమా ఇది. నేను ఫ్లాప్‌లో ఉన్న ప్రతిసారీ ఈ బ్యానర్ హిట్ ఇస్తుంది. సెంటిమెంట్‌గా చూస్తే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో నా రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవన్‌కల్యాణ్‌గారు, రెండు త్రివిక్రమ్‌గారు. ఈ ఇద్దరూ నా వెనకున్నారు. అదే నా ధైర్యం అదే నా దమ్ము’’ అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com