త్రిష ప్రధాన పాత్రలో 'మైండ్ డ్రామా' నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం '1818'
- IndiaGlitz, [Friday,January 06 2017]
నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల హవా నడుస్తోందిప్పుడు. నయనతార, అంజలి ఈ తరహా సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. అదే బాటలో త్రిష నాయికా ప్రాధాన్య సినిమాలకు సై అంటోంది. తెలుగులో 'నాయకి'గా ఆకట్టుకున్న త్రిష ప్రస్తుతం 'మోహిని'గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరో మహిళా ప్రధాన ద్విభాషా చిత్రంలో నటించేందుకు కొత్త సంవత్సరంలో సిద్ధమవుతోంది. మైండ్ డ్రామా పతాకంపై రిథున్ సాగర్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ -1818. నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ..
దర్శకనిర్మాత రిథున్ సాగర్ మాట్లాడుతూ - ''11 నవంబర్ -2008 ముంబై ఎటాక్స్(26/11 ఎటాక్స్) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రమిది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబై- తాజ్ హోటల్ సహా పలుచోట్ల దారుణ మారణకాండకు పాల్పడ్డారు. వందలాది అమాయక ప్రజల్ని హతమార్చారు. పలువురు విదేశీయుల్ని చంపేశారు. అయితే ప్రత్యేకించి తాజ్‌హోటల్‌లో జరిగిన మారణకాండలో అసలేం జరిగింది? అక్కడ ఇతర వ్యవస్థలతో తెగిన మిస్ కమ్యూనికేషన్ వల్ల ఎలాంటి పరిణామాలు సంభవించాయి? అన్నది ప్రధానంగా ఈ సినిమాలో చూపిస్తున్నాం. హోటల్ హోస్టెస్ పాత్రలో త్రిష నటిస్తున్నారు. తన ఆహార్యం సరికొత్తగా ఉంటుంది. అలాగే నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, సుమన్, డా.బ్రహ్మానందం పాత్రలు హైలైట్‌గా ఉంటాయి'' అని తెలిపారు.
త్రిష, డా.రాజేంద్రప్రసాద్, సుమన్, బ్రహ్మానందం, 'సూదుకవ్వం' ఫేం రమేష్, తిలక్, 'రాజా రాణి' ఫేం మీరా ఘోషల్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, కెమెరా: ఓం ప్రకాష్, పాటలు: మదన్ కర్కి, వైరముత్తు.