త్రిష...ఇది వెలుగుల దశ
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని సార్లు జీవితంలో ఏదో సాధించేయాలని ఉంటుంది. కానీ ఎలా సాధించాలి? మనం ఎంపిక చేసుకున్న రంగంలో మనకు తెలిసిన వాళ్లున్నారా? తెలిసిన వాళ్లకే అన్నీ సవ్యంగా జరగని ఈ రోజుల్లో మనకేం జరుగుతుంది అనే నిస్పృహ ఆవహించవచ్చు. కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగువేయాలే కానీ అలాంటి నిరాశలు నిస్పృహలు పటాపంచలైపోతాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ త్రిష కృష్ణన్.
త్రిష పుట్టింది పాలక్కాడ్ అయ్యర్ ఫ్యామిలీలో. తల్లి ఉమ, తండ్రి కృష్ణన్ ఇద్దరూ ఉద్యోగులే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత చదువుకున్న స్కూల్లో విద్యాభ్యాసం చేసింది త్రిష. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎతిరాజ్ కాలేజీలో చదివింది. మోడల్‌గా, పలు అందాల పోటీల్లో ఆమె పాల్గొన్నది అక్కడి నుంచే.
పూలదారి కాదు..!
మోడలింగ్ అనేది సినిమాల్లోకి స్టెప్పింగ్ స్టోన్ అని నమ్మిన రోజులవి. అందుకే త్రిష కూడా అలాగే అడుగులు వేసింది. అక్కడి నుంచే ఆమె `జోడీ` సినిమాలో కనిపించింది. అప్పుడు స్టార్ హీరోయిన్ సిమ్రన్. ఆమె నాయికగా నటించిన `జోడీ`లో త్రిష జస్ట్ అలా కనిపించీ కనిపించనట్టు సైడ్ ఆర్టిస్టుగా కనిపిస్తుందంతే. ఆ తర్వాత ఆమె నటించిన రెండు, మూడు సినిమాలు కూడా అనుకున్న తేదీలకు విడుదల కాలేదు. అయినా త్రిషలో ఎక్కడా నిస్పృహ లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు తనదవుతుందనే నమ్మకం ఆమెది. అందుకే వేచి చూసింది. సూర్య సరసన నటించిన `మౌనం పేసియదే` ఆమె తొలి చిత్రంగా విడుదలైంది. మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత నిదానంగా తమిళ సినిమా ఆఫర్లు ఆమె తలుపుతట్టాయి. అక్కడి నుంచి ఆమె మెల్లగా టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. తెలుగులో ఆమె నటించిన `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` మళ్లీ లంగా ఓణీల్లో హీరోయిన్‌ని చూపించాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కురిశాయి. ఆ తర్వాత కూడా ఆమె అటు తమిళ సినిమాల్లోనూ, ఇటు తెలుగు సినిమాల్లోనూ క్షణం తీరిక లేకుండా చేస్తూనే వచ్చింది. ఎంతగా అంటే, హీరోలను పక్కనపెట్టి,కేవలం త్రిష ఉంటే చాలు తెలుగు, తమిళంలో సినిమాకు మార్కెట్ వేల్యూ ఉంటుందనేంతగా.
కలిసి రాలేదు..!
అలాంటి స్టార్ డమ్ ఉన్న సమయంలోనే హిందీలో అడుగుపెట్టింది. దక్షిణాదిన చాకచక్యంగా ఎదిగిన త్రిష ఎందుకో ఉత్తరాది పెద్దగా కలిసి రాలేదు. అక్కడ ఆమె నటించిన సినిమా `కట్టామీట్టా`కు పెద్దగా స్పందన కూడా రాలేదు. మూడు సినిమాలు చేయడానికి అప్పట్లో అంగీకరించిన త్రిష `ఇది నా టీ కప్పు కాదు` అనుకుందేమో, బాలీవుడ్ నుంచి నిర్మొహమాటంగా వెనక్కి వచ్చేసింది. తన సామ్రాజ్యంలో రాణిలాగా బతుకుతూ, పొరుగు రాజ్యాన బానిసలా ఎందుకు ఉండాలన్నది ఆమె తత్వం. అందుకే ఆమె రాణీవాసాన్నే ఇష్టపడింది. మళ్లీ హిందీ చిత్రాల జోలికి వెళ్లలేదు.
నిర్మొహమాటంగా..!
తను నమ్మిన విషయం ఎంత చెడు చేస్తుందని తెలిసినా, ఎంత మంచి చేస్తుందని అనిపించినా, ప్రజలకు నిర్మొహమాటంగా చెప్పడానికి ఆమె ఎప్పుడూ వెనకాడలేదు. ఆమెను చూసి ఎంతో మంది నేర్చుకోవాల్సిన విషయం ఇదే. త్రిష ఎప్పుడూ `వాళ్లేమనుకుంటారో` అనే విషయాన్ని గురించి ఆలోచించలేదు. తానేం అనుకుంటే అదే చేసింది. అంగరంగ వైభవంగా చేసుకున్న వరుణ్‌మణియన్‌తో నిశ్చితార్థాన్ని కూడా ఆమె రద్దు చేసుకోగలిగింది. ఆ విషయాన్ని కూడా ధైర్యంగా ప్రకటించగలిగింది. ఇప్పటికీ ఆమెకు పెళ్లి మీద సదభిప్రాయం ఉంది. కాకపోతే సరైన వ్యక్తి దొరికే వరకు పెళ్లికి తొందర లేదంటుంటుంది ఈ 35 ఏళ్ల చిన్నది.
సమాజ సేవ..!
త్రిషలో చెప్పుకోవాల్సిన మరో యాంగిల్ సమాజ సేవ. అందులోనూ మూగ ప్రాణులంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ. ఆ గుణమే ఆమెను పీటాకు దగ్గర చేసింది. ఇప్పటికీ పీటా అప్రిషియేషన్ పొందుతూనే ఉంది. ఎక్కడినుంచో ఫారిన్ బ్రీడ్ కుక్కలను తెచ్చి పెంచుకోవడం కాదు, మన జాతి కుక్కలను పెంచుకోండి. నిరాశ్రయులుగా రోడ్ల మీద తిరిగే కుక్కలకు ఆశ్రయం కల్పించండి అనేది త్రిష నమ్మే సిద్ధాంతం. ఆమె ఎక్కడున్నా ఈ విషయాలను చెప్పడంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటుంది.
హీరోయిన్‌తో వివాదం..!
ఇతరులతో మనం పోటీపడినప్పుడే కదా, పోటీలో మన స్థానం ఎంత? ఎక్కడున్నాం? అని ఆలోచించాల్సింది.. పోటీలో పాల్గొనకపోతే అసలు ఆ అవసరమే లేదుగా అనేది త్రిష నమ్మే సిద్ధాంతం. అయినా ఆమె పోటీలో ఉంది. ఒకానొక సమయంలో త్రిషకు, ఆమె తోటి నటి నయనతారకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. కారణం తెలియదు కానీ, కొన్నాళ్లు ఇద్దరూ మాట్లాడుకోలేదని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ మధ్య మాత్రం ఇద్దరూ బాగానే కలుస్తున్నారు. సరదాగా ఫొటోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. త్రిష ఎప్పుడూ సరదాగా ఉండటానికి ట్రై చేస్తారు. ఏ మాత్రం సమయం ఉన్నా ఆమె ఫ్రెండ్స్ తో సమయం గడుపుతారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటిస్తుంటారు.
ఎత్తుపల్లాలు..!
కెరీర్ ఎంతటి ఒడిదొడుకుల్లో ఉన్నా త్రిష ఎప్పుడూ దిగులుపడరు. కావాలంటే కొన్నాళ్లు కెరీర్‌కు బ్రేక్ ఇవ్వగలరు. ఆడవారి మాటలకు తర్వాత త్రిష కొన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె ఇక సినిమాలు చేయరు.. అనే వార్తలు కూడా వినిపించాయి. అప్పుడు కెరీర్‌కు కాస్త బ్రేక్ తీసుకుని పవర్ యోగాలు నేర్చుకున్నారు. నటిగా తన ఫిజిక్‌ను మెయింటెయిన్ చేయడానికి సాటి నటీమణుల కన్నా ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటారు త్రిష. కెరీర్‌లోవచ్చే ఎత్తుపల్లాలకు ఆమె ఎప్పుడూ దిగులుపడలేదు. ఎందుకంటే ఆమె కెరీర్ పూర్తవుతుందనే ప్రతి సారీ ఏదో ఒక రూపంలో హిట్ తలుపు తడుతూనే ఉంది. తాజాగా ఆ మధ్య `ఏమాయ చేసావె` తమిళ వెర్షన్, ఈ మధ్య `96` వచ్చినట్టు.
పట్టించుకోదు..!
త్రిష గాసిప్పులను ఏ రోజూ పట్టించుకోలేదు. ఆమె ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నారని ఆ మధ్య విపరీతమైన పుకార్లు వచ్చాయి. వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. త్రిష ఏ హీరోతో నటిస్తే, ఆ హీరోతో ఆమెను జత కడుతూ ఎన్నో సార్లు వార్తలొచ్చాయి. వాటి గురించి కనీసం ఆమె పట్టించుకున్న దాఖలాలుగానీ, వివరణ ఇచ్చిన సందర్భాలుగానీ లేవు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే త్రిషకు చెన్నైలో ఆహ్లాదకరమైన హోటల్ కట్టాలన్నది ఆశ. ఫ్రెండ్స్ అందరూ కలిసి చిల్ అవుట్ అయ్యేలా యూత్‌కు నచ్చే ఫుడ్‌తో ఆ హోటల్ ఉండాలని ఆమె డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నెన్నో కమర్షియల్ యాడ్స్ లో త్రిషతో కలిసి నటించిన ఆమె తల్లి ఉమా కృష్ణన్ ఈ హోటల్ నిర్వహణ బాధ్యతలను చూసుకోనున్నారు. గాడ్ బ్లెస్... త్రిష కలలన్నీ నెరవేరాలని ఇండియా గ్లిడ్జ్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది
(త్రిష పుట్టినరోజు సందర్భంగా)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout