తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం.. నదిలో దొరికిన డైరెక్టర్ మృతదేహం..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి అకాల మరణం చెందారు. సట్లెజ్ నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవరి 4వ తేదీన ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. సిమ్లా నుంచి స్పితికి వెళ్తుండగా వెట్రి కారు సట్లేజ్ నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అదే కారులో ప్రయాణిస్తున్న గోపినాథ్ అనే మరో వ్యక్తిని స్థానికులు రక్షించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
అయితే కారు డ్రైవర్ టెంజిన్ మాత్రం స్పాట్‌లోనే చనిపోయారు. ఇదే సమయంలో కారులో ఉన్న వెట్రీ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో గత 9 రోజుల నుంచి ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వెట్రీ దురైస్వామి చెన్నై నగర మాజీ మేయర్ సదాయి దురైస్వామి కుమారుడు కావడంతో ఆయన భారీ రివార్డు ప్రకటించారు. వెట్రీ ఆచూకీని కనిపెట్టిన వారికి కోటి రూపాయలు నజారానా ఇస్తానని వెల్లడించారు. మరోవైపు అధికారులు కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, జిల్లా పోలీసులు ఈ గాలింపులో పాల్గొన్నారు.
ఈ క్రమంలో మహిన్ నాగ్ అసోసియేషన్‌కు చెందిన గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు. ఎట్టకేలకు ఘటనా స్థలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆయన మృతదేహాన్ని నదిలో గుర్తించారు. అదే సమయంలో నది ఒడ్డున మానవ మెదడు పదార్థం లాంటిది కనుగొన్నారు. ఇది వెట్రికి చెందిదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి డీఎన్‌ఏ పరీక్ష కోసం పంపించారు. అలాగే ఈ మృతదేహాన్ని షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
వెట్రీ మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన సంతాపం తెలియజేశారు. అలాగే తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా వెట్రి దురైస్వామి తమిళంలో ‘ఇంద్రావతు ఒరునాల్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout