ఫలించని రెస్క్యూ ఆపరేషన్ .. సింగరేణిలో విషాదం, గనిలో చిక్కుకున్న ముగ్గురూ మృతి

  • IndiaGlitz, [Wednesday,March 09 2022]

పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో గనిలో చిక్కుకుపోయిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్ట్‌ (ఏఎల్‌పీ) బొగ్గు గనిలో సోమవారం మధ్యాహ్నం పైకప్పు కూలడంతో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు.

వీరిలో ఇద్దరు అదేరోజు రాత్రి ప్రాణాలతో బయటపడగా.. సేఫ్టీ మేనేజర్‌ జయరాజ్‌, గని అసిస్టెంట్‌ మేనేజర్‌ చైతన్యతేజ, బదిలీ వర్కర్‌ రవీందర్‌, కాంట్రాక్ట్ ఉద్యోగి తోట శ్రీకాంత్‌ చిక్కుకున్నారు. వీరిలో రవీందర్‌ను మంగళవారం సాయంత్రం సహాయక సిబ్బంది కాపాడారు. గనిలో చిక్కుకున్న మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చైతన్యతేజ, జయరాజ్‌, శ్రీకాంత్‌ మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం వారి మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

ఇక ఇప్పటికే బొగ్గుగని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాధిత కార్మిక కుటుంబాలకు అండగా ఉండాలని సింగరేణి సీఎం శ్రీధర్‌కు సూచించారు. అటు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్లే బొగ్గుగని పైకప్పు కూలిందని.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.