కాంగ్రెస్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు..!
- IndiaGlitz, [Monday,July 29 2019]
కాంగ్రెస్ పార్టీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ పార్టీకి చెందిన కీలక నేతలు, ఉద్ధండులు ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు కీలక నేతలు తుదిశ్వాస విడవడంతో కాంగ్రెస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అనారోగ్యంతో కన్నుమూయడం జాతీయ స్థాయిలో పార్టీకి పెద్ద షాకని చెప్పవచ్చు. అయితే ఈ మరణవార్త మరువక మునుపే తెలంగాణకు చెందిన కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి, మంచి తనానికి మారుపేరుగా నిలిచిన జైపాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. జైపాల్ అంత్యక్రియలు ముగిసిన గంటల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మరణించారు. కాగా ఈ ముగ్గురు ఉద్ధండులే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగిన నేతలే.
రెండుసార్లు మంత్రిగా..!
గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ముఖేశ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నది. చివరికి చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. 1959 జులై 1న జన్మించిన ముఖేశ్‌గౌడ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు మంత్రిగా సేవలందించారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా.. 2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
రాజకీయాల్లోకి ఇలా వచ్చారు..!
ముఖేష్ గౌడ్ 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం కొనసాగించారు. మొదట్నుంచే కాంగ్రెస్ భావజాలానికే ఆకర్షితులైన ఆయన విద్యార్థి దశలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ‘ఎన్ఎస్‌యూఐ’లో పనిచేశారు. యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించారు. 1986లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన జాంబాగ్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 1989లో మహారాజ్ గంజ్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2004లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ను వరుస ఓటములు వెంటాడాయి. 2014, 2018లో రెండుసార్లు గోషామహల్ నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఇదిలా ఉంటే.. ముఖేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు విక్రమ్‌గౌడ్, విశాల్ గౌడ్, ఒక కుమార్తె శిల్ప ఉన్నారు. ముఖేశ్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా రేపు అనగా మంగళవారం నాడు ముఖేశ్ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.