ఏపీలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తే జైలుకే.
Send us your feedback to audioarticles@vaarta.com
ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇంగ్లిష్ మీడియం బోధన, మొక్కజొన్న ధరలు పెంపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఇసుక రవాణాలో ఎవరైనా అక్రమాలు, అవినీతికి పాల్పడితే రెండేళ్లు జైలుశిక్షతో పాటు జరిమానా విధించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా ఇంగ్లిష్ మీడియం బోధనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలన్నింటిలో అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ సమావేశం గురించి మంత్రి పేర్ని నాని మీడియా ముందుకొచ్చి వివరాలు వెల్లడించారు.
2 లక్షలు జరిమానా.. రెండేళ్లు జైలు..
‘ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక నిల్వ చేసి, దాన్ని విక్రయించే అధికారం ఎవరికీ లేదు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే రూ.2 లక్షల జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తాం. రోజూ రెండు లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతాం. పది రోజుల్లో డిమాండ్‌కు తగ్గట్టుగా ఇసుకను సరఫరా చేస్తాం’ అని మంత్రి నాని స్పష్టం చేశారు. కాగా.. నిన్న జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నిర్ణయాలు తీసుకోగా ఇవాళ కేబినెట్ ఆమోదం లభించింది.
మరికొన్ని కీలక నిర్ణయాలివీ..!
‘పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. వ్యర్థాలపై ఆడిట్ నిర్వహిస్తాం. దీనికోసం ఏపీ పర్యావరణ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ప్రమాదవశాత్తు మత్య్సకారులు చనిపోతే వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద రూ.10లక్షలు అందిస్తాం. సోలార్, పవన విద్యుత్ పాలసీలకు సవరణలు చేస్తాం. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టానికి సవరణలు తీసుకొస్తాం. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు, ఎనిమిది ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని మంత్రి నాని మీడియాకు వెల్లడించారు.
అయితే కేబినెట్ నిర్ణయించింది.. మంత్రిగారు మీడియా ముందుకొచ్చి స్పీచ్లిచ్చారు ఇంతవరకూ అంతా ఓకేగానీ ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందనేదే ఇప్పుడు సందేహంగా మారుతోంది. అంతేకాదు మరోవైపు ఇదే నిర్ణయం గోదావరిలో బోటు బోల్తాకు ముందే తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments