అమెరికా పర్యటనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జూన్ 6 వరకు అక్కడే

టీపీసీసీ చీఫ్ , మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు యూఎస్‌కు బయల్దేరుతున్న ఆయన జూన్ 6వ తేదీ వరకు న్యూజెర్సీ, డెట్రాయిట్, అట్లాంటా, ఫిలడెల్ఫియా నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చివరిగా డల్లాస్ నగరంలో జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొని జూన్ 6న తిరిగి భారతదేశానికి రానున్నారు రేవంత్.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఓ డిబేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో వున్న న్యూజెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోసిషన్ సెంటర్‌లో మే 28న ఈ డిబేట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నుంచి మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొననున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అలాగే బీజేపీ నుంచి ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు హాజరుకానున్నారు. రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదిక మీదకు రానుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా వీరి మధ్య తెలంగాణలోని పలు అంశాలు, సమస్యలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.