Touch Chesi Chudu Review
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో మాస్ మహారాజా రవితేజ. 2015లో `బెంగాల్ టైగర్` తర్వాత రెండేళ్లు సినిమాలేవీ చేయకుండా గ్యాప్ తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత అంటే 2017లో రాజా ది గ్రేట్ సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో పాటు `టచ్ చేసి చూడు` సినిమాను ఓకే చేశారు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే హీరోల్లో రవితేజ ఒకరు. ఈ `టచ్ చేసి చూడు` సినిమాతో విక్రమ్ సిరికొండను దర్శకుడి చేశారు రవితేజ. మరి విక్రమ్ సిరికొండ రవితేజను తెరపై ఎలా ప్రజెంట్ చేశారు. పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ ఎలాంటి పవర్‌ను చూపించారో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
కథ:
కార్తికేయ (రవితేజ) కుటుంబానికి విలువిచ్చే వ్యక్తి. తనతో పాటు తన ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలని అనుకుంటాడు. తన కుటుంబం కోరిక మేరకు పుష్ప (రాశీఖన్నా)ను పెళ్లిచూపుల్లో చూస్తాడు. అయితే ఆమెతో విడిగా మాట్లాడిన క్షణాల్లో అమ్మాయిలతో మాట్లాడలేని తన తత్వాన్ని బయటపెట్టుకుంటాడు. దాంతో పుష్ప అతని మీద కోపం తెచ్చుకుంటుంది. వారిద్దరి మధ్య ఈ వ్యవహారం జరుగుతున్న తరుణంలో కార్తికేయ చెల్లెలు ఓ హత్యను చూస్తుంది. హత్య చేసిన వ్యక్తి బొమ్మ గీస్తే ఇర్ఫాన్ లాలా అని తేలుస్తారు. అయితే అతను చనిపోయి అప్పటికే కొన్నేళ్లు అవుతుంటుంది. అలాంటి వ్యక్తిని రోడ్డుమీద చూపిస్తుంది కార్తికేయ చెల్లెలు. అతన్ని చూసీచూడగానే కార్తికేయ ఊగిపోతాడు. అతన్ని వెంటపడి వేటాడటమే మిగిలిన కథ. ఈ కథలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దివ్యకి, కార్తికేయకి ఉన్న బంధం ఎలాంటిది? ఇర్ఫాన్ లాలా ఎవరు? తన టీచర్‌కి కార్తికేయ ఇచ్చిన మాట ఏంటి? హత్యలను ఎవరు చేశారు? ఎందుకు చేశారు? కార్తికేయ పోలీసు యూనిఫార్మ్ కి దూరంగా ఎందుకు ఉంటున్నాడు..? అనేదే.
ప్లస్ పాయింట్లు:
ఆ మధ్య బాగా సన్నగా కనిపించిన రవితేజ `టచ్ చేసి చూడు`లో బాగా కనిపిస్తున్నారు. `రాజా ది గ్రేట్` కన్నా ఇందులో మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. రాశీఖన్నా మరింత తగ్గి రవితేజకు సరిపోయారు. రాశీ, సీరత్ ఇద్దరూ అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. నటీనటులందరూ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. సత్యం రాజేశ్, వెన్నెలకిశోర్ పాత్రలు కాసింత రిలీఫ్‌గా అనిపించాయి. మురళీశర్మ తన పాత్రలో ఒదిగిపోయారు. కెమెరాపనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. కాస్ట్యూమ్స్ బావున్నాయి.
మైనస్ పాయింట్లు:
కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. వర్క్, ఫ్యామిలీ బ్యాలన్స్ చేసే అంశం చాలా పలుచటి థ్రెడ్. ఆ విషయాన్ని డైలాగులకే పరిమితం చేశారు. సీన్లను అతికించినట్టు అనిపిస్తుంది. పైగా రవితేజకు ఈ తరహా సినిమాలు కొత్తకాదు. ఫ్యామిలీ కోసం పాటుపడే వ్యక్తిగా, వర్క్ కోసం ఫ్యామిలీని కూడా పోగొట్టుకున్న వ్యక్తిగా ఆయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. జామ్ 8 అని కొత్తవారి చేత చేయించిన బాణీలు కూడా మెప్పించవు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. తొలిసగంలో నిడివి కూడా ఎక్కువగా అనిపిస్తుంది.
విశ్లేషణ:
రవితేజను హీరోగా ఊహించుకుని, ఆయన సినిమాకు ఎలాంటి అంశాలు తోడైతే అభిమానులు ఎంజాయ్ చేస్తారో ఊహించి, ఆ మేరకు తెరకెక్కించిన సినిమాలాగా అనిపిస్తుంది. హీరో సైలెంట్‌గా గుడ్ బోయ్‌గా ఉండటం, తీరా సెకండాఫ్‌లో అతనికి ఓ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వంటివన్నీ ఇవాళ తెలుగు సినిమాల్లో కొత్తకాదు. ఎప్పటి నుంచో వస్తున్నవే. ఈ సినిమాలోనూ రిపీట్ అయింది. సన్నివేశాలు రక్తికట్టించాయా అంటే అదీ లేదు. హీరో పవర్ ఎలివేట్ కావాలంటే విలనిజం కూడా అంతే బలంగా ఉండాలి. అయితే ఈ సినిమాలో విలనీ తేలిపోయింది. అసిస్టెంట్ కమిషనర్‌గా కార్తికేయ చేసే పనులను కమిషనర్ (మురళీశర్మ) ఓ వైపునుంచి వేడుక చూసినట్టు చూస్తుంటాడు. అది అంత తేలిగ్గా మింగుడు పడదు. విలన్ గ్యాంగ్‌లో అనుమానాలు రేపి వారిని విడదీసే ప్రక్రియ కూడా తెలుగు సినిమాలకు కొత్తేం కాదు. చోటా, మోటా కలిసి ముగ్గురు, నలుగురు విలన్‌లను చూపించినా ఎవరూ రిజిస్టర్ కారు. ఇర్ఫాన్ లాలా అనే వ్యక్తిగానీ, అతని తండ్రిగానీ బలమైన విలన్‌లు కారు. కార్తికేయ వార్ ఒన్‌సైడ్ సాగించినట్టు అనిపిస్తుంటుంది. ఫక్తు కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
బాటమ్ లైన్: 'టచ్ చేసి చూడు' వార్ ఒన్‌సైడ్
Touch Chesi Chudu Movie Review in English
- Read in English