Nagababu: ఏదో మూడ్‌లో అన్నారేమో వదిలేయండి... గరికపాటిని ఏమి అనకండి : మెగా ఫ్యాన్స్‌కి నాగబాబు రిక్వెస్ట్

  • IndiaGlitz, [Saturday,October 08 2022]

విజయదశమిని పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘‘అలయ్ బలయ్’’ కార్యక్రమం పెను వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనికి మెగా బ్రదర్ నాగబాబు, మెగా ఫ్యాన్స్ ధీటుగా బదులిస్తున్నారు. దీనిపై రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్.. గరికపాటితో ఫోన్‌లో మాట్లాడారు. మెగాస్టార్ పట్ల మీరు వ్యవహరించిన తీరు తమకు బాధ కలిగించిందని అన్నారు. అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వారిని తాము శాంతింపజేశామని ఆయన చెప్పారు. దీనికి గరికపాటి స్పందిస్తూ.. తనను మెగా అభిమానులెవ్వరూ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. చిరంజీవి ఎంతో సహృదయుడని.. ఈ విషయంపై ఆయనతో మాట్లాడతానని గరికపాటి చెప్పారు.

ఏదో మూడ్‌లో వుండి వుంటారులే:

సాయంత్రం ఈ వ్యవహారంపై మెగాబ్రదర్ నాగబాబు ట్వీట్ చేశారు. ‘‘ గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request ’’ అంటూ నాగబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే:

విజయదశమిని పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో ఎప్పటిలాగే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు గరికపాటి నరసింహారావు ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. అయితే చిరంజీవిని చూడగానే అక్కడున్న వారంతా ఆయనను చుట్టిముట్టేశారు. సెల్‌ఫోన్‌లు తీసి చిత్రీకరించడంతో పాటు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. సరిగ్గా అప్పుడే గరికపాటి ప్రసంగం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చిరంజీవి చుట్టూ వున్న జనం కేకలు, ఈలలు వేస్తూ గోల చేయడంతో నరసింహారావులో సహనం నశించింది. అంతే వేదిక మీద నుంచే ‘‘చిరంజీవిగారు.. మీ ఫోటో సెషన్ ఆపితే.. నేను ప్రసంగం మొదలెడతా’’ నంటూ తీవ్ర స్వరంతో గద్దించారు.

గరికపాటికి చిరంజీవి క్షమాపణలు:

గరికపాటి కామెంట్స్‌తో వెంటనే స్పందించిన చిరంజీవి జనానికి సర్దిచెప్పి ఆ గుంపు నుంచి బయటకు వచ్చేశారు. నరసింహారావుకు క్షమాపణలు చెప్పడంతో పాటు తన ఇంటికి ఓ రోజున భోజనానికి రావాల్సిందిగా కోరారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్.. గరికపాటిపై విరుచుకుపడుతున్నారు. మీమ్స్ , కామెంట్స్‌తో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.