Top 10 Movies: ఈ ఏడాది బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించిన టాప్ 10 చిత్రాలివే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు కలెక్షన్లు కష్టమంటూ అవహేళనలు ఎదుర్కొన్న టాలీవుడ్ వెయ్యి కోట్ల మార్క్‌ను అవలీలగా చేరుకుని ప్రజెంట్ ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి చేరుకుంది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ నిన్న మొన్నటి కార్తీకేయ 2 వరకు సాగింది. ఒక్కో ఏడాది ఒక్కో మార్క్‌ను దాటుకుంటూ తెలుగు సినిమా తన మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి అవేంటో ఒకసారి చూస్తే:
ఆర్ఆర్ఆర్:
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో విశేషాలు బోలెడు. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
పలు దేశాల్లో భారతీయ సినిమాలకు ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో అక్టోబర్ 21న జపాన్‌లో డబ్ చేసి వదలగా అక్కడా దుమ్మురేపుతోంది. ఈ సినిమాను చూసేందుకు జపనీయులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రదర్శించబడుతోన్న థియేటర్స్ కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా ట్రెడ్ పండితులు చెబుతున్నారు. తద్వారా జపాన్‌లో అత్యధిక కలెక్షన్లను సాధించిన సాహో, బాహుబలి 2 రికార్డులను ఆర్ఆర్ఆర్ బద్ధలు కొట్టింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘‘ముత్తు’’ను క్రాస్ చేసే దిశగా పయనిస్తోందని తెలుస్తోంది.
సర్కార్ వారి పాట :
ఈ ఏడాది కుటుంబంలో అన్నీ విషాదాలే నెలకొన్నా ... మహేశ్‌ను కాస్త ఊరడించే అంశం ‘‘సర్కార్ వారి పాట’’ విజయం. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ... మహేశ్ నటన, కీర్తి సురేష్ అందచందాలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అంశాలు పుష్కలంగా వుండటంతో ట్రోల్స్, నెగిటివ్ టాక్‌ను కూడా తట్టుకుని నిలబడింది. టోటల్ రన్‌లో రూ.180 కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.
భీమ్లా నాయక్ :
గతేడాది వకీల్ సాబ్‌తో మంచి విజయాన్ని అందుకున్న పవన్.. సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు గాను మరోసారి రీమేక్‌నే నమ్ముకున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మించగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.161 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పవన్ స్టామినా ఏంటో మరోసారి తెలియజేశాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, కొత్త సినిమాలు పోటీ వచ్చినా భీమ్లా నాయక్‌ను పవన్ క్రేజ్ నడిపించింది.
రాధేశ్యామ్ :
బాహుబలి సిరీస్, సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘‘రాధేశ్యామ్’’. సాహో నిరాశపరిచిన నేపథ్యంలో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభాస్. దీనికి తోడు ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు, ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కావడంతో అభిమానులంతా దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ కూడా లైఫ్ అండ్ డెత్‌లా ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. అటు నిర్మాతలు కూడా ప్రభాస్ మిత్రులే కావడంతో యూవీ క్రియేషన్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు.
సాహో చేదు అనుభవం మిగిల్చినప్పటికీ... బయ్యర్లు సైతం ప్రభాస్ మీద నమ్మకంతో భారీ రేట్లకు రాధేశ్యామ్ అమ్ముడైంది. చివరికి రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే డివైడ్ టాక్ రావడంతో వారానికే రాధేశ్యామ్ దుకాణం సర్దేసింది. క్లాస్ ఆడియన్స్‌కి తప్పించి మాస్‌ను ఈ సినిమా ఏమాత్రం ఎక్కలేదు. దీంతో బయ్యర్లు నిండా మునిగిపోయారు. స్వయంగా నైజాం ఏరియాలో ఈ సినిమాను రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు సైతం గట్టి దెబ్బ తగిలింది. ఓవరాల్‌గా ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. కానీ ప్రభాస్ క్రేజ్‌తో ఓపెనింగ్స్ భారీగా రావడం, డార్లింగ్ ఫ్యాన్స్, యువత తొలి వారం పోటెత్తడంతో రూ.151 కోట్ల కలెక్షన్లను సాధించింది రాధేశ్యామ్.
ఎఫ్ 3:
ఈ ఏడాది ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన చిత్రం ‘ఎఫ్3’. ఎఫ్ 2కి సీక్వెల్‌గా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్ కౌర్‌లు నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సునీల్, అలీలు ముఖ్యపాత్రలు పోషించారు. మే 27న రిలీజైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లను అందుకుంది. టోటల్ రన్‌లో ఈ సినిమా రూ.134 కోట్లను రాబట్టింది. ఓటీటీలు, టికెట్ ధరలు పెంపు, భారీ బడ్జెట్ సినిమాల కారణంగా ఎఫ్ 3 వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. లేదంటే వసూలైన మొత్తం ఇంకా పెరిగేది.
కార్తీకేయ 2 :
ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంచలన విజయం సాధించిన చిత్రం కార్తీకేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన కార్తీకేయకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 13, 2022న రిలీజైంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్‌కి కార్తీకేయ 2 బాగా కనెక్ట్ అయ్యింది. తొలుత హిందీలో 50 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో స్క్రీన్ల సంఖ్య 3,000కు పెరిగింది. అంతేకాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమీర్ ఖాన్ ‘‘లాల్ సింగ్ చద్దా’’, అక్షయ్ కుమార్ ‘‘రక్షాబంధన్’’లు కార్తీకేయ ముందు నిలబడలేకపోయాయి. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్‌లు కీలకపాత్ర పోషించారు.
గాడ్‌ఫాదర్:
ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాబట్టకపోవడంతో చిరు రీమేక్‌నే నమ్ముకున్నారు. అలా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘‘లూసీఫర్’’పై కన్నేశారు. మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్‌ను మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశారు. దీనిని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించారు దర్శకుడు మోహన్ రాజా. నయనతార, సత్యదేవ్‌లకు తోడు సల్మాన్ ఖాన్ మెరుపులతో గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ సినిమా అంటే అభిమానులు చాలా అంశాల్ని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఎలిమెంట్స్‌ని మిక్స్ చేసి విందు భోజనం అందించారు మోహన్ రాజా. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షోతోనే మంచి టాక్ సొంతం చేసుకుంది. టోటల్ రన్‌లో రూ.108.7 కోట్ల వసూళ్లు రాబట్టి మెగా అభిమానులకు ఊరట కలిగించింది.
సీతా రామమ్:
ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంచలన విజయం అందుకున్న సినిమా సీతారామం. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుత ప్రేమ కావ్యంగా నిలిచిపోయింది. పాటలు, సన్నివేశాలతో యువతను, అన్ని వర్గాల వారిని కట్టిపాడేసింది. రిలీజైన తొలి షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. సీతారామంలో దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, రష్మిక మందన్న , సుమంత్, భూమికలు కీలకపాత్రలు పోషించారు. లవ్ స్టోరీలకు ఆదరణ తగ్గుతున్న సమయంలో వచ్చిన ఈ సినిమా ఆ జోనర్ ట్రై చేయాలనుకుంటున్న వారికి మంచి బూస్టప్ ఇచ్చింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా తెరకెక్కించిన సీతారామం ప్రపంచవ్యాప్తంగా రూ.91.4 కోట్ల వసూళ్లను సాధించింది.
ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 ఘన విజయం సాధించగా.. తర్వాత చేసిన సైరా నర్సింహారెడ్డి నిరాశపరిచింది. దీంతో మెగా అభిమానులకు ఈసారి ట్రీట్ ఇవ్వాలని చిరు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా అపజయం ఎరుగని కొరటాల శివను దర్శకుడిగా ఎంచుకుని, ఫ్యాన్స్‌కు నచ్చే అన్ని ఎలిమెంట్స్ వుండేలా పక్కాగా ప్లాన్ చేశారు . దీనికి తోడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గెస్ట్ రోల్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కోవిడ్, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య ఎట్టకేలకు ఏప్రిల్ 29, 2022న రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా అభిమానులకు ఏమాత్రం ఎక్కలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన స్టామినాతో రూ.76 కోట్ల వసూళ్లు సాధించిపెట్టడం కొసమెరుపు.
బింబిసార:
కోవిడ్ తర్వాత థియేటర్ల వంక చూడటానికే జనం భయపడుతున్న వేళ... తెలుగు సినిమాకు , నిర్మాతలకు, నటీనటుల్లో జోష్ నింపిన చిత్రం బింబిసార. కథ బాగుంటే ప్రేక్షకుడు ఖచ్చితంగా థియేటర్‌కు వస్తాడని ఈ సినిమా నిరూపించింది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి, బాక్సాఫీస్‌కు కళ తెచ్చింది. కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్‌గా నటించారు. కథ, కథనం, పాటలు జనాన్ని ఆకట్టుకోవడంతో బింబిసారుడు టోటల్ రన్‌లో రూ.64.57 కోట్ల వసూళ్లు సాధించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments