బూతులు తిట్టి, దాడి చేశారు.. వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు రైటర్ చిన్ని కృష్ణ ఫిర్యాదు
- IndiaGlitz, [Saturday,February 19 2022]
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. తనపై కొందరు దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నికృష్ణ పోలీసులను కోరారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న తనపై దుండగులు దాడికి యత్నించారని, పరుష పదజాలంతో దూషించారని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్ని కృష్ణ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా.. చిన్ని కృష్ణ స్టార్ రైటర్‌గా తెలుగు నాట ఫుల్ ఫేమస్. అగ్ర కథానాయకుల సినిమాలకు కథలు అందించి ప్రముఖ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ ‘గంగోత్రి’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, చిరంజీవి నటించిన ‘ఇంద్రా’ వంటి సినిమాలకు ఆయన కథలు అందించారు.