టాలీవుడ్‌లో మరో విషాదం.. గేయ రచయిత కందికొండ కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,March 12 2022]

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కందికొండ శనివారం హైదరాబాద్ వెంగళరావు నగర్‌లో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన మొక్కవోని ధైర్యంతో ఆ వ్యాధిని జయించినా, దాని ప్రభావం వెన్నెముకపై పడింది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించగా... ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నా కోలుకోలేకపోయారు.

ఇకపోతే.. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఉస్మానియాలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై ఆసక్తి కారణంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో పరిచయడం ఏర్పడింది.

2001లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఆ రోజుల్లో ఆ పాట యువతను విశేషంగా అలరించింది. దీంతో వరుస అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అలా ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. ఈ విధంగా 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాసిన ఆయన మరణం తెలుగు సినీ సంగీత ప్రియులను విషాదంలోకి నెట్టింది.