Vijay Devarakonda : ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో కలకలం , అంతా ‘‘లైగర్’’ వల్లేనా..?

  • IndiaGlitz, [Wednesday,November 30 2022]

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరవ్వడం కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో మనీలాండరింగ్, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కౌర్‌లు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. లైగర్ సినిమాలో కొందరు రాజకీయ నాయకులు కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అనుమానిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు పెట్టుబడిగా పెట్టిన నగదును దుబాయ్‌కి పంపించి అక్కడి నుంచి లైగర్‌లో ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అభిమానులను నిరాశపరిచిన లైగర్:

ఇకపోతే.. బాక్సింగ్ కథాంశంతో తెరకెక్కిన లైగర్ ఎన్నో అంచనాల మధ్య రిలీజై అభిమానులకు నిరాశను మిగిల్చింది. అంతేకాకుండా.. ఛార్మీ, పూరి జగన్నాథ్‌లపైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అలాగే విజయ్, ఛార్మీ, పూరికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ కారణం వల్లే పూరితో చేయాల్సిన జనగణమన ప్రాజెక్ట్ నుంచి విజయ్ దేవరకొండ తప్పుకున్నాడని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి.

ఓ రాజకీయ నేత ప్రమేయంపై ఆరా:

లైగర్ అనంతరం జనగణమణ చిత్రాన్ని రూపొందించే ఉద్దేశంతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడమే కాకుండా.. ఇందుకోసం రూ. 20 కోట్లు కూడా ఖర్చు చేశారని ప్రచారం జరిగింది. ఈ ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలోనే అప్పుడు లైగర్ కోసం ఫండింగ్ చేసిన వారి వివరాలను సేకరించేందుకు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ప్రధానంగా ఓ రాజకీయ నాయకుడి ప్రమేయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం వుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.