Ravindra Babu:టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత రవీంద్రబాబు కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,November 11 2023]

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి మరవకముందే.. నిర్మాత యక్కలి రవీంద్రబాబు(55) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రవీంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన ఛార్టర్డ్ ఇంజనీరింగ్‌గా పనిచేశారు. సినిమాలపై ఇష్టంతో నిర్మాతగా పరిశ్రమలో అడుగు పెట్టారు. తన మిత్రులతో కలిసి శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీశారు. అలాగే ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘రొమాంటిక్ క్రిమినల్స్’, ‘గల్ఫ్’, ‘వలస’ లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డులు అందుకున్నారు.

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా సినిమాలు నిర్మించారు. రవీంద్రబాబు నిర్మాతగానే కాకుండా గీత రచయితగా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నారు. ‘హనీ ట్రాప్’, ‘సంస్కార్ కాలనీ’, ‘మా నాన్న నక్సలైట్’ లాంటి పలు చిత్రాలలో పాటలు రాశారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డితో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగుమ్మాయి డింపుల్ హయాతీని ‘గల్ఫ్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ఆమె రవితేజతో ‘ఖిలాడి’, గోపిచంద్‌తో ‘రామబాణం’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కరోజే సినీ పరిశ్రమలో రెండు విషాదాలు చోటుచేసుకోవడం బాధాకరమని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తూ వారి కుటుంబసభ్యులకు తమ సంతాపం తెలియజేస్తున్నారు.