టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు...
Send us your feedback to audioarticles@vaarta.com
అనేక గొప్ప సినిమాకు టాలీవుడ్‌కు అందించిన ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు. తెలుగు చిత్ర సీమలో అనేక గొప్ప సినిమాలను చేసి విజయాలను అందుకున్న నిర్మాతగా దొరస్వామి రాజు అందరికీ సుపరిచితమే. నేటి(సోమవారం) ఉదయం ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా దొరస్వామి రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆయనను బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. వయోభారమే ఆయన అనారోగ్యానికి కారణమని తెలుస్తోంది.
నిర్మాతగా దొరస్వామి రాజు దాదాపు 500 సినిమాలు తెరకెక్కించారు. ఇక డిస్ట్రూబ్యూటర్‌గా అయితే ఎన్నో సినిమాలను సీడెడ్ ఏరియాల్లో విడుదల చేశారు. దీంతో నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్ళాం, వెంగమాంబ వంటి అద్భుత చిత్రాలను ఆయన నిర్మించారు. 1978లోనే తిరుపతి పట్టణంలో 'విజయమల్లేశ్వరి కంబైన్స్(వి.ఎమ్.సి.)' పేరు మీద డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ప్రారంభించారు. ఈ సంస్థ చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమై తొలుత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 'సింహబలుడు' చిత్రాన్ని విడుదల చేసింది.
అనంతరం 1979లో యన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 'డ్రైవర్ రాముడు' తో తమ వి.ఎమ్.సి. సంస్థ ను గుంతకల్ కేంద్రంగా రాయలసీమ అంతటా విస్తరించారు. వి.ఎమ్.సి.తో పాటు విజయలక్ష్మీ పిక్చర్స్ వి.ఎల్.పి. సంస్థను కూడా దొరస్వామి రాజు స్థాపించి పలు చిత్రాలను విడుదల చేశారు. రెండు పర్యాయాలు ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడిగానూ.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గానూ దొరస్వామిరాజు పని చేశారు. అనంతరం ఆయన రాజకీయ ఆరేంగేట్రం కూడా చేశారు. 1994లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా.. అనారోగ్య కారణాల రీత్యా ఆయన కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. దొరస్వామి రాజు మరణ వార్త విని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments