టాలీవుడ్ 2016 గడిచిన 6 నెలల సమీక్ష
- IndiaGlitz, [Tuesday,July 05 2016]
జనవరి నుంచి జూన్ వరకు ఆశించిన స్ధాయిలో భారీ విజయాలు సాధించకపోయినా...ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి ని ఇచ్చింది. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు అని మరోసారి నిరూపించింది. అప్పుడే అర్ధ సంవత్సరం అయిపోయింది. ఇంతకీ ఈ ఆరు నెలల బాక్సాఫీస్ రిపోర్ట్ ఏమిటి..? ఈ ఆరు నెలల రిపోర్ట్ ఏం చెబుతుందో చూద్దాం..!
జనవరి 1న రామ్ నటించిన నేను శైలజ చిత్రం రిలీజైంది. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా నేను శైలజ చిత్రం మంచి విజయాన్ని సాధించి ఈ సంవత్సరానికి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక సంక్రాంతి కానుకగా బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో.., శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రాల్లో ఎవరూ ఊహించని విధంగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 53 కోట్ల కు పైగా షేర్ సాధించి నాగార్జున కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా రికార్డ్ సాధించింది. అలాగే ఎన్టీఆర్ నటించిన నాన్నకుప్రేమతో...చిత్రం కూడా దాదాపు 50 కోట్ల షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. బాలయ్య డిక్టేటర్ అభిమానుల్ని అలరించింది. శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా కూడా కమర్షియల్ గా మంచి విజయాన్నిసాధించింది.
ఈ ప్రధమార్ధంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిన్న సినిమాలు పెద్ద విజయాల్ని దక్కించుకున్నాయి. క్షణం, కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలు సరికొత్తగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు కొత్తదనం ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు అని చెప్పడానికి తాజా ఉదాహరణ ఊపిరి. నాగార్జున వీల్ ఛైర్ లో కూర్చొనే పాత్ర చేయాలనుకోవడంలోనే సగం విజయం సాధించేసారు. కార్తీ పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించడం...కథ కొత్తగా ఉండడంతో ఊపిరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే కొత్త కథలతో సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఆదరిస్తారని నిరూపించి ఇండస్ట్రీకి ఊపిరి ఇచ్చింది. త్రివిక్రమ్ తన రూటు మార్చి నితిన్ తో కుటుంబం అంతా కలిసి చూసేలా అ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సమ్మర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం అల్లు అర్జున్, బోయపాటి కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. విభిన్నకథా చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన 24 మూవీ డబ్బింగ్ చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈడోరకం ఆడోరకం, సుప్రీమ్, జెంటిల్ మన్ చిత్రాలు యూత్ ఆకట్టుకుని కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. అయితే...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్, సూపర్ స్టార్ మహేష్ నటించిన బ్రహ్మోత్సవం చిత్రాలు అంచనాలను తారుమారు చేసాయి. ఈ రెండు భారీ చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేక డిజాస్టర్స్ గా నిలిచాయి.
ప్రధమార్ధంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిత్రం బిచ్చగాడు. డబ్బింగ్ సినిమాయే అయినా...కంటెంట్ బాగుండడంతో స్ట్రైయిట్ మూవీ రేంజ్ లో దాదాపు 20 కోట్లు సాధించింది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా...సరికొత్త కథలతో రూపొందిన చిత్రాలను ప్రేక్షకులను ఆదరించారు. మూస కథలతో రూపొందిన చిత్రాల్లో స్టార్ హీరోలు నటించినా సరే...తిరస్కరించారు. మొత్తం మీద హీరోల్లో, రచయితల్లో, నిర్మాతల్లో, దర్శకుల్లో మార్పు తీసుకువచ్చింది. ఈ విధంగా ప్రధమార్ధం పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నిఇచ్చింది. ద్వితీయార్ధం కూడా మంచి సినిమాలు, కొత్తతరహా సినిమాలు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి..ద్వితీయార్ధం కూడా బాగుంటుంది అని ఆశిద్దాం.