Pawan Kalyan: పవన్ కల్యాణ్ గెలుపు కోసం రంగంలోకి హీరోలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ పిఠాపునం నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంది. అక్కడ పవన్‌ను ఓడించాలని వైసీపీ నేతలు ఎత్తులు వేస్తుంటే.. ఎలాగైనా గెలిచి తీరాలని జనసేన నేతలు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్, జానీ మాస్టర్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్‌తో పాటు పలువురు జబర్దస్ట్ ఆర్టిస్ట్‌లు పవన్ తరుపున ప్రచారం చేస్తున్నారు.
అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు భార్య పద్మజా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగారు. పిఠాపురంలో తన తమ్ముడిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కూడా బాబాయ్ పవన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. 'మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి’ అని ట్విట్టర్ వేదికగా ఓటర్లను కోరారు.
ఇక మెగా ఫ్యామిలీతో పాటు ఇతర హీరోలు కూడా పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు తెలియజేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనానికి మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. 'ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అంటూ నాని ట్వీట్ చేశారు.
అలాగే మరో యువ హీరో రాజ్ తరుణ్ కూడా ‘ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఒక ఆశ. మీరు గెలిచి ప్రజల తలరాతలను మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 'త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది.. పవన్ కళ్యాణ్ సర్ మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ హనుమాన్ హీరో తేజ సజ్జా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు.
ఇక "ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ప్రజాపోరాటం నుంచి వెనక్కు తగ్గని మీ పోరాటపటిమ ఎప్పటికీ స్పూర్తి , రానున్న ఎన్నికలలో జనసేనానికి అన్ని శుభాలు జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను సదా మీ ప్రేమకి బానిస"అంటూ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు. అలాగే నిర్మాత నాగవంశీ కూడా పిఠాపురంలో జనసైనికులతో సమావేశమై పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానంటూ తెలిపారు. మొత్తానికి పవన్ కళ్యాణ్‌కి, జనసేన పార్టీకి టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com