కొత్త సంవత్సరం టాలీవుడ్‌లో తొలి విషాదం.. దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత
- IndiaGlitz, [Monday,January 03 2022]
గతేడాది కరోనా, తదితర కారణాలతో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2022 అయినా సాఫీగా, సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు ప్రజలు. అయితే కొత్త సంవత్సరంలోనే తొలి విషాదం చోటు చేసుకుంది. అలనాటి సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి (86) కన్నుమూశారు. ఈ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. పీసీ రెడ్డి దాదాపు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజ నటుల చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే సూపర్‌స్టార్ కృష్ణ చిత్రాలకు ఎక్కువగా చేశారు. భలే అల్లుడు, మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పట్నవాసం, అన్నా చెల్లెలు తదితర చిత్రాలకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు.
పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933 అక్టోబర్ 14న ఆయన జన్మించారు. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బి.ఏ. పూర్తి చేశారు. ఈ క్రమంలోనే నటుడు వల్లం నరసింహారావు పరిచయమయ్యారు. ఆయన ప్రోత్సాహంతోనే 1960లో రూపొందిన ‘శ్రీకృష్ణరాయబారం’ చిత్రానికి డైరెక్టర్ ఎన్.జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తరువాత దర్శకుడు వి.మధుసూదనరావు వద్ద 11 సంవత్సరాలు అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా పనిచేశారు పి.సి.రెడ్డి. ఆపై ఆదుర్తి సుబ్బారావు వద్ద ‘పూలరంగడు’ చిత్రానికి కో-డైరెక్టర్ గా ఉన్నారు. అనంతరం 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘అనూరాధ’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు.