‘‘కమర్షియల్’’ ఫార్ములాకు జైకొట్టిన జనాలు , స్టార్లు సార్ స్టార్లంతే..!!

  • IndiaGlitz, [Thursday,December 30 2021]

ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో మ‌నిషి.. తాను మ‌నిషిన‌నే విష‌యాన్ని ఎప్పుడో మ‌రిచిపోయాడు. పొద్దున్నే లేవ‌డం.. హ‌డావిడిగా ఆఫీసుల‌కు, పాఠ‌శాల‌లకు, కాలేజీల‌కు వెళ్ల‌డం.. తీవ్ర‌మైన ఒత్తిడిలో పనిచేయ‌డం.. ట్రాఫిక్‌లో ఇంటికి రావ‌డం.. మాన‌సిక ప్ర‌శాంత‌త లోపించ‌డం.. వెర‌సి.. స‌గ‌టు మనిషి ఆరోగ్యకరమైన జీవ‌న విధానాన్ని పాటించ‌డం లేదు స‌రి క‌దా.. ఎప్పుడూ మాన‌సిక స‌మ‌స్య‌లు, ఒత్తిళ్ల‌తో నలిగిపోతున్నాడు. ఇక మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే.. ఉద్యోగాలు చేసే వారైనా.. గృహిణులైనా.. వారికి ఎప్పుడూ స‌మ‌స్య‌లే.. ఒక భార్య‌గా, త‌ల్లిగా, కోడ‌లిగా వారు నిత్యం అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటుంటారు.

కాంక్రీట్ జంగిల్స్‌లా మారుతున్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో మ‌నుషులు పరాయివారి సంగతి పక్కనబెట్టి సొంత కుటుంబసభ్యులతో నిత్యం గ‌డిపే స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఇది వారి మ‌ధ్య బంధాలు సన్న‌గిల్లేందుకు ముఖ్య కార‌ణంగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ దేవుడు.. ఓ మ‌నిషీ.. ముందు నువ్వు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త‌ల‌ను.. నీ బంధాల‌ను ఒక్క‌సారి గుర్తు తెచ్చుకో.. నీ కుటుంబ స‌భ్యులు, నీ చుట్టూ ఉన్న‌వారిని ఆత్మీయంగా ప‌ల‌క‌రించు.. వారి క‌ష్ట న‌ష్టాల‌ను తెలుసుకో అంటూ కరోనాను, లాక్‌డౌన్‌ను తెచ్చాడా అనిపిస్తోంది.

ఈ వేదాంతాన్ని పక్కనబెడితే... ఈ ఏడాది రెండో దశ కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశప్రజలకు వినోదం కోసం తల్లడిల్లిపోయారు. సినిమా థియేటర్లు, పార్కులు, పబ్‌లు, రిసార్టులు, క్లబ్లులు, రిక్రియేషన్ సెంటర్లు మూతపడటంతో ఓటీటీలే దిక్కయ్యాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు ఇలా ప్రపంచ సినిమా భారతీయ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కథాబలం, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే వంటి అంశాలు జనాన్ని కట్టిపడేశాయి. దీంతో నాలుగు పాటలు, రెండు కామెడీ సీన్లు, ఒక మసాలా సాంగ్‌తో ఫక్తు కమర్షియల్ ఫార్ములాతో వుండే తెలుగు సినిమాను జనం ఆదరిస్తారా అన్న ఆందోళన మేకర్స్‌ను వెంటాడింది. దీనికి తగ్గట్టుగానే ఓటీటీలో చాలా చౌకగా ఇంటిల్లిపాది సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు .. థియేటర్లకు రావడం మానేశారు.

దీంతో రిజల్ట్ ఎలా వుంటుందా అని భావించి రిలీజ్ చేసిన కొన్ని కమర్షియల్ సినిమాలు దుమ్మురేపాయి. విమర్శలకు చెక్ పెడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకి ఊపిరి పోశాయి. అలా టాలీవుడ్‌కు తొలి కమర్షియల్ హిట్ 'క్రాక్'. ఇది రోటీన్ కథే. కాకపోతే దర్శకుడు గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్‌లు, వేటపాలెం కాన్సెప్ట్‌తో సినిమాను కొత్తగా ప్రజెంట్ చేశారు. దాంతో విజయం వరించింది. 'క్రాక్' తర్వాత వచ్చిన 'ఉప్పెన' కూడా భారీ విజయం దక్కించుకుంది.

పెద్దింటి అమ్మాయి- పేదింటి అబ్బాయిల మధ్య ప్రేమకథలను ఎన్టీఆర్ కాలం నుంచి జనం ఆదరిస్తూనే వున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి అద్భుత నటనకు దేవి శ్రీ ప్రసాద్ పాటలు తోడు కావడంతో ‘‘ఉప్పెన’’ భారీ వసూళ్లు సాధించింది. తర్వాత చెప్పుకోవాల్సింది జాతి రత్నాలు'. చిన్ని సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ హిట్ సొంతం చేసుకుంది. థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలలో ఫట్ అయ్యింది. దీనిని చూసి విమర్శకులు పెదవి విరిచారు. దీనిని బట్టి తేలింది ఏంటంటే.. కొన్ని సినిమాలు థియేటర్లలో చూడటానికి మాత్రమే ప్రేక్షకులు ఇష్టపడతారని.

ఇక సెకండ్ లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘‘వకీల్ సాబ్’’ సైతం భారీ కలెక్షన్స్ సాధించింది. హిందీలో సూపర్‌హిట్ అయిన పింక్ రీమేక్‌కు తెరకెక్కిన ఈ మూవీని తెలుగు నేటీవిటికి తగ్గట్టుగా మార్పులు చేర్చారు. అంతేకాదు హీరో పవన్ కల్యాణ్ పాత్రను కమర్షియలైజ్ చేశారు. అదే సమయంలో మహిళల సమస్యలకూ చోటు ఇచ్చారు. పవన్ క్యారెక్టరరైజేషన్ వల్లే ‘‘వకీల్ సాబ్’’కు భారీ వసూళ్లు వచ్చాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేవలం ప‌వ‌న్‌ను చూడ‌టం కోసమే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. అదీ స్టార్ పవర్. కమర్షియల్ సినిమా స్టామినా!

ఇక డిసెంబర్ చివరిలో వచ్చిన నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను నటించిన 'అఖండ' విషయంలోనూ మరోసారి కమర్షియల్ సినిమా సత్తా ఏంటో చూపించింది. బాలకృష్ణ యాక్షన్ ఎక్కువ అయ్యిందని విమర్శించినవారు వున్నారు. అంతేకాదు తమన్ వల్లే సినిమా ఆడిందని.. బోయపాటి కథకు కాకుండా యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారని జోకులు పేల్చారు. కానీ అవేవీ జన ప్రవాహాన్ని థియేటర్లకు రప్పించడాన్ని ఆపలేకపోయాయి. రూరల్ ఏరియాల్లో ట్రాక్టర్లు ఎక్కి మరీ జనాలు 'అఖండ' చూడటం కోసం వచ్చారంటే అందుకు కారణంగా బాలకృష్ణ వంటి సూపర్‌స్టార్ వున్నాడనే. దీనితో పాటు అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 'ఎస్ఆర్ కళ్యాణమండపం', 'శ్యామ్ సింగ రాయ్', 'రొమాంటిక్' సినిమాలు కూడా మంచి వసూళ్లు రాబట్టాయి.