సినీ కార్మికుల కోసం ముందుకొచ్చిన తారాలోకం
- IndiaGlitz, [Monday,March 30 2020]
కరోనా వైరస్(కోవిడ్ 19) ప్రభావంతో దేశమంతటా స్తంభించి పోయింది. పలు రంగాలు ఆగిపోయాయి. అందులో పనిచేసే పలువురు కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సినీ రంగంలోనూ రోజు వారీ కళాకారులు ఇబ్బందికర పరిస్థితులను అనుభవిస్తున్నారు. వారి కుటుంబాలు ఆకలి సమస్యను ఎదుర్కొంటుంది. ఇది గమనించిన సినీ పరిశ్రమ చిరంజీవి అధ్యక్షతన కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం అనే సంస్థను స్టార్ట్ చేశారు. ఇందులో డి.సురేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సి.కల్యాణ్, దామోదర్ ప్రసాద్ వంటి వారు సభ్యులుగా ఉన్నారు. వీరు సినీ కార్మికులను ఆదుకోవాలంటూ నటీనటులకు విజ్ఞప్తి చేశారు.
ప్రారంభంలో సినీ కార్మికుల కోసం కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు చిరంజీవి. ఎన్టీఆర్ కూడా అప్పటికే రూ.25 లక్షలను ప్రటించారు. చిరంజీవి ట్విట్టర్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేశారు. కింగ్ నాగార్జున కోటి రూపాయలు, దగ్గుబాటి ఫ్యామిలీ (డి.సురేష్‌బాబు, విక్టరీ వెంకటేశ్, రానా) రూ. కోటి లను విరాళంగా ప్రకటించారు. అలాగే కరోనా నియంత్రణకు విరాళాలను అందించిన మహేశ్ మరో రూ.25 లక్షలు, రామ్‌చరణ్ రూ.30 లక్షలు, నాగచైతన్య రూ.25 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, శర్వానంద్ రూ.15 లక్షలు, సాయితేజ్ రూ.10 లక్షలు, దిల్‌రాజు, శిరీష్ రూ.10 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5 లక్షలు, హీరో కార్తికేయ రూ.2లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలను విరాళంగా ప్రకటించారు.
సినీ కార్మికుల కోసం సినీ తారలు ముందుకు వచ్చి విరాళాలను అందించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేరు పేరునా కృతజ్ఞతలను తెలిపారు.