సాయంత్రంకల్లా టాలీవుడ్ షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ !
- IndiaGlitz, [Thursday,May 21 2020]
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ దర్శకనిర్మాతలు, సీనియర్ హీరోలు భేటీ అయ్యారు. సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న చిరు ఇళ్లు ఈ భేటీకి వేదిక అయ్యింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, సినిమా థియేటర్లు సైతం బంద్ అయిన విషయం విదితమే. అయితే కరోనా ఎంతకీ తగ్గకపోవడంతో ఇక తగు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ షురూ చేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే ఒకట్రెండుసార్లు షూటింగ్ విషయమై చర్చించిన పెద్దలు ఇవాళ మంత్రితో సమావేశం అయ్యారు. ఈ భేటీకి మెగాస్టార్ అధ్యక్షత వహిస్తున్నారు.
మీటింగ్‌కు వచ్చింది వీరే..
కొద్ది సేపటి క్రితమే మంత్రి తలసాని.. మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు. అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వి.వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్. శంకర్, కొరటాల శివ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇప్పటికే షూటింగ్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని ప్రణాళికలతో కూడిన నివేదిక తయారు చేశారని సమాచారం. ఈ భేటీలో భాగంగా ఆ నివేదికను మంత్రి తలసానికి అందజేస్తారని తెలుస్తోంది. భేటీ అనంతరం చిరు, నాగార్జునతో పాటు నిర్మాతలతో కలిసి తలసాని మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం.
సాయంత్రం కల్లా గ్రీన్ సిగ్నల్..
కాగా.. భేటీ అనంతరం నేరుగా సీఎం కేసీఆర్‌తో తలసాని భేటీ అయ్యి చర్చించిన అనంతరం ఇవాళ సాయంత్రం కల్లా సినిమా, సీరియల్స్, టీవీ షోలకు సంబంధించి షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశాలు వంద శాతం కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేదానిపై కూడా ప్రభుత్వం నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల కానున్నాయని సమాచారం. ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చాయి. టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు మొదలుకుని చిన్నపాటి సినిమాలు, షోలు, సీరియల్స్‌కు చాలా రోజులుగా షూటింగ్ జరగలేదు. సినీ ఇండస్ట్రీకే కోట్లాది రూపాయిలు నష్టం వాటిల్లింది. అందుకే ఇక షూటింగ్స్ షురూ చేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్-01 నుంచి షూటింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నారట.