టాలీవుడ్‌లో మరో విషాదం : నటుడు కన్నుమూత .. సంక్రాంతికి ఇంటికొచ్చి కానరాని లోకాలకు

  • IndiaGlitz, [Thursday,January 20 2022]

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది కరోనా, ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు తదితర కారణాలతో సినీ ప్రముఖులు కన్నుమూశారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ అనారోగ్యంతో మరణించడంతో పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తాజాగా మరో నటుడు కన్నుమూశారు. ఆది, శంకర్ దాదా MBSS, ప్రేమ కావాలి, ఆ ఇంట్లో లాంటి సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించిన కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొంచాడ శ్రీనివాస్ మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో గడుపుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.

గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు శ్రీనివాస్ ఛాతి భాగంలో దెబ్బ తగిలిందని, ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించగా ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది. అప్పటినుంచి శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన కొంచాడ శ్రీనివాస్.. 10కి పైగా సీరియళ్లలోనూ అలరించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలిపారు.