Prajapalana:ప్రజాపాలన కార్యక్రమానికి నేడే చివరి తేదీ.. దరఖాస్తు చేసుకున్నారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. ఈ పథకాలకు అర్హులు గుర్తించేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి రోజు నుంచే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. డిసెంబర్ 31న ఆదివారం, నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న మాత్రం దరఖాస్తులు స్వీకరించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 8 లక్షల 94వేల 115 ప్రజాపాలన దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో ఆరు గ్యారంటీల కోసం 93లక్షల 38వేల111 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 15,55, 704 దరఖాస్తులు ఇతర అంశాలపై వచ్చినట్లు పేర్కొన్నారు. ఇవాళ చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 12వేలకుపైగా గ్రామ పంచాయితీల్లో 3వేలకుపైగా మన్సిపాలిటీ వార్డుల్లో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 500పైగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 21లక్షల 52వేల 178 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 4లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డు కోసమే వచ్చాయి. ఇందులోనూ పాతబస్తీ నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఇప్పటివరకు అందుకున్న దరఖాస్తులను స్క్రూట్నీ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. వీటిని ఆన్లైన్ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనున్నారు. జనవరి 17నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ చేసేందుకు భారీగా డీటీపీ ఆపరేటర్లను నియమించారు. అయితే ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వారి అర్హతలను ఎలా నిర్ణయిస్తుందనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు.
వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు ఎలాంటి అర్హతలు నిర్ణయిస్తారనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉంటే ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments