తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కాగా.. బుధవారం సాయంత్రం ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం భీమవారానికి చెందిన దుర్గాప్రసాద్.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 26 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గూడురు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 1996 వరకూ చంద్రబాబు కేబినెట్లో విద్యాశాఖా మంత్రిగా పని చేశారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు.
దుర్గా ప్రసాద్ మృతి పట్ల ప్రముఖ రాజకీయ నాయకులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దుర్గాప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దుర్గాప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి తదితరులు దుర్గాప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments