తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి షాక్..
- IndiaGlitz, [Monday,April 12 2021]
తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఒకవైపు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లో ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచిత గౌరవం ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. పవన్ పిలుపుతో మూడేళ్ల క్రితం తాను జనసేనలో చేరినట్లు తెలిపారు. పార్టీలో కొంతమందికి సముచిత గౌరవం ఇస్తూ పార్టీ బలోపేతానికి కష్టపడే వారిని పవన్ పట్టించుకోవడంలేదని గంగాధరం వాపోయారు. పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి సారించలేదన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతోందో తెలియలేదన్నారు.
తన రాజీనామా విషయమై గంగాధరం మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి సారించలేదు. అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలు వేయలేదు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. పార్టీ విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. పవన్ పోటీ చేసిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ తీసుకోలేదు. సినిమా ప్రపంచం వేరు. రాజకీయ ప్రపంచం వేరు. ఈ రెండింటికీ తేడా తెలియకుండా వ్యవహరిస్తే నాబోటి సీనియర్లు మీతో కలిసి పని చేయలేరు. జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేయడం సమంజసం కాదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా’’ అని మాదాసు గంగాధరం లేఖలో పేర్కొన్నారు.