Tirumala Laddu: రాములోరి కోసం వెంకన్న.. అయోధ్యకు తిరుమల నుంచి లడ్డూలు తరలింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. రామ.. రామ.. ఇప్పుడు దేశమంతా రామ నామ స్మరణ మార్మోమోగుతోంది. శ్రీ రాముడు తన జన్మ భూమిలో కొలువు దీరే అమృత ఘడియలకు సమయం ఆసన్నమైంది. జై శ్రీరామ్ నినాదాల మధ్య ఆకాశమే మురిసేలా ఆ రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీంతో రామభక్తులు తమకు తోచిన విధంగా భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ రాములోరి కోసం ఈ వెంకన్న కూడా కదిలారు. తనకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం రామ భక్తులకు అందించేలా ఏర్పాట్లు చేశారు.
బాలరాముడి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు ఉంటే శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు లక్ష లడ్డూలను తయారుచేసి అయోధ్యకు తరలించింది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. స్వచ్ఛమైన దేశీయ ఆవునెయ్యిని వినియోగించి లడ్డూలు తయారుచేశారు. దాదాపు 3వేల కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలిస్తున్నారు.
ఈ విమానం సాయంత్రంలోగా అయోధ్యకు చేరుతుంది. అనంతరం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందించనున్నారు. లడ్డూల తయారీకి బోర్డు సభ్యులు సౌరభ్ బోరా 2వేల కిలోలు, మాజీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు 2వేల కిలోల దేశీయ ఆవు నెయ్యిని విరాళంగా అందించినట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. అలాగే మరో బోర్డు సభ్యులు శరత్ చంద్రారెడ్డి.. లడ్డూలను అయోధ్యకు తరలించేందుకు తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రామమందిరం నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రైల్వేస్టేషన్ పునర్‌నిర్మాణం, నూతన విమానాశ్రయం ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా అడుగడుగునా అయోధ్యలో మార్పు కనపడుతోంది. రామమందిరం ప్రారంభమైన దగ్గర నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరానున్నారు. అందుకు తగ్గట్లు పర్యాటకులకు ఎలాంటి అసాకర్యకం కలగకుండా అయోధ్యను తీర్చిదిద్దుతున్నారు. నగరంలో ఏ మూల చూసినా త్రేతాయుగం ఆనవాళ్లు కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య పునర్‌నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.85వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout