ఇండియన్ సినిమా ముఖ్యంగా దక్షిణాది సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది. అందులో భాగంగా కొత్త జోనర్స్ సినిమాలు రూపొందుతున్నాయి. అలా రూపొందిన చిత్రమే `టిక్ టిక్ టిక్`. తొలి ఇండియన్ స్పేస్ మూవీ. జయం రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైంది. గతంలో జాంబీ హారర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడ శక్తి సౌందర్ రాజన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. 1998లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అర్మగడన్ నుండి ఇన్‌స్పిరేషన్ పొంది మన నెటివిటీకి తగిన విధంగా తెరకెక్కించారు. మరి ఈ స్పేస్ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం
కథ:
వైజాగ్‌లో గ్రహ శకలం పడుతుంది. దాని తర్వాత మరో పది రోజుల్లో భూమి కంటే పెద్ద పరిమాణంలోని మరో గ్రహ శకలం భూమి వైపు వస్తుందని.. దాని కారణంగా నాలుగుకోట్ల మది చనిపోవడమూ.. భారీ ఆస్థినష్టం జరుగుతుందనే వివరాలు ఇండియన్ ఆర్మీకి అందుతాయి. అందువల్ల ఆ శకలాన్ని పేల్చేసే భారీ మిసైల్ కొరియా ఆధ్వర్యంలో స్పేస్‌లో ఉందని ఇండియన్ ఆర్మీకి తెలుస్తుంది. దాన్ని అంతరిక్షం చేరుకుని మిసైల్ సహాయంతో పేల్చేయాలని ఆర్మీ చీఫ్ (జయప్రకాశ్) నిర్ణయం తీసుకుంటారు. అందుకని ఓ ప్రైవేట్ ఆపరేషన్‌ను నిర్వహిస్తారు. అందుకోసమని ఇద్దరు ఆర్మీ అధికారులు (విన్సెంట్ అశోకన్, నివేదా పేతురాజ్)లతో పాటు గొప్ప మేజిషియన్, దొంగగా ముద్ర వేసుకుని జైలు జీవితం అనుభవిస్తున్న వాసు(జయం రవి), అతని స్నేహితులు (అర్జునన్, వెంకట్) ఓ టీమ్‌గా ఏర్పడుతారు. వాసుకి పదేళ్ల కొడుకు ఉంటాడు. స్పేస్‌లోకి ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఓ అజ్ఞాతవ్యక్తి వాసుని బెదిరించి తన మాట వినకపోతే.. అతని కొడుకుని చంపేస్తామని.. అలా చంపకుండా ఉండాలంటే స్పేస్ కంట్రోల్‌లో ఉండే మిసైల్‌ను తన కంట్రోల్‌లో ఉండేలా చేయాలని కోరుతాడు. అప్పుడు వాసు ఏం చేస్తాడు? తన కొడుకుని త్యాగం చేస్తాడా? దేశం కోసం ఎలా నిర్ణయం తీసుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్మీ అధికారులు చేసే సాహసమే టిక్ టిక్ టిక్. సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జయం రవి పాత్రకు తగ్గట్లు హుందాగా నటించాడు. సన్నివేశాలకు తగ్గట్టు హావభావాలను పలికించాడు. జయం రవి నిజమైన కొడుకు ఆరవ్.. ఈ సినిమాలో రీల్ కొడుకుగా నటించడం మరో విశేషం. నివేదా పేతురాజ్, విన్సెంట్ అశోకన్, వెంకట్, అర్జునన్, జయప్రకాశ్, అజీజ్ తదితరులు పాత్రల పరిధులు మేర చక్కగా నటించారు. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ఇన్‌స్పిరేషన్‌గా ఓ పాయింట్‌ను తీసుకుని దాన్ని మన నెటివిటీకి తగిన విధంగా మలిచాడు. దీనికి తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్.. మధ్యలో విలన్ హీరోని బ్లాక్‌మెయిల్ చేయడం.. కొడుకుని కాపాడుకోవడం కోసం హీరో ముందు విలన్ చెప్పినట్లు వింటాడు. చివరకు స్పేస్‌కు చేరుకోవడం.. అక్కడ జరిగే ఫైట్ అందులో మిసైల్‌ను చేజిక్కించుకోవడం.. చివరకు బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని బురిడీ కొట్టించి మిసైల్ ఇవ్వకుండా.. దేశాన్ని కాపాడే సందర్భం ఇలా సన్నివేశాలు చక్కగా ఉన్నాయి. అలాగే మేజిషియన్‌గా జయం రవి చేసే విన్యాసాలు లాజిక్‌కు చాలా దూరంగా ఉన్నాయి. అలాగే సన్నివేశాల్లో ఎమోషనల్ కనెక్టివిటీ ఎఫెక్టివ్‌గా లేవు. అయితే శక్తి సౌందర్‌రాజన్ సినిమా టేకింగ్ చాలా బావుంది. ముఖ్యంగా ఎస్.వెంకటేశ్ సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అలాగే సినిమాలో రెండు పాటలు సిచ్యువేషనల్ సాంగ్సే. పెద్దగా బాలేవు. ఇక ఇమాన్ అందించిన నేపథ్య సంగీతం మూవీ చూసే ప్రేక్షకుడికి ఓ మంచి ఫీల్‌నిస్తుంది. కమర్షియల్ సినిమాలే కావాలనుకునే ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించలేరు.
బోటమ్ లైన్: టిక్ టిక్ టిక్.. ఓ మంచి ప్రయత్నం
Comments