మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి ఉగాది ట్రీట్.. “టైగర్ నాగేశ్వరరావు” నుంచి ప్రీ లుక్
- IndiaGlitz, [Saturday,April 02 2022]
మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి మూవీని రిలీజ్ చేసిన ఆయన... రామారావు ఆన్ డ్యూటీతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇది కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు రవితేజ. ఇకపోతే.. ఆయన ఓ బయోపిక్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాను వంశీ తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసింది. ఇదిలావుండగా.. ఉగాదిని పురస్కరించుకుని టైగర్ నాగేశ్వరరావు నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రీ లుక్ ను విడుదల చేయించింది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రీ లుక్‌లో రైలు వెనుక వస్తుండగా.. ఓ కొరడా పట్టుకుని.. భయంకరంగా కనిపిస్తున్నాడు రవితేజ. ఈ ఒక్క ఫోటోతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1970-80 మధ్య కాలంలో టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ఉండేవాడు. వరుస దొంగతనాలతో పోలీసులకు, ప్రజలకు నిద్రలేకుండా చేసేవాడు. అయితే, ఆయన చెడ్డ దొంగ కాదని, ఉన్నవాళ్లను దోచుకుని.. పేదలకు సాయం చేసేవాడని స్టువర్ట్‌పురం పరిసర ప్రాంత ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకునేవారు. అందుకే అతడిని ఇండియన్ రాబిన్ హుడ్ లేదా స్టువర్టుపురం రాబిన్ హుడ్ అని పిలిచేవారు. నాగేశ్వరరావు పోలీసుల నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకొనేవాడు. దీంతో ఆయన్ని అంతా ‘టైగర్’ అని పిలవడం మొదలుపెట్టారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు చివరికి 1987లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ‘‘రావణాసుర’’ చిత్రంలోనూ నెగిటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్ చేయనున్నారట రవితేజ.