జనసేన తరఫున 'బన్నీ' పోటీ.. టికెట్ ఫిక్స్!
- IndiaGlitz, [Friday,March 08 2019]
టైటిల్ చూడగానే అవునా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన తరఫున పోటీ చేస్తున్నారా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అస్సలు కానే కాదండోయ్.. మెగా, అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.. నేను మెగా ఫ్యామిలీకి భక్తుడిని అని చెప్పుకునే ‘బన్నీ వాస్’. ఈయన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బినామీగా అని పిలుస్తుంటారు. ఆయన అండదండలతో బన్నీవాస్ కొన్ని కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. అంతేకాదు.. మెగా ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా అంటే చాలు మరుక్షణమే మీడియా ముందు వాలిపోయే వాసు.. రాజకీయాల్లోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎప్పట్నుంచో తహతహలాడుతున్నాడు.
పాలకొల్లుకు ప్రిస్టేజ్‌గా తీసుకున్న మెగా ఫ్యామిలీ..
పాలకొల్లు నుంచి వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున పోటీ చేయడానికి బన్నీ వాస్ ఆసక్తి చూపిస్తున్నాడు. జనసేన తరుపున బన్నీ వాస్ పోటీ చేస్తే మెగా కుటుంబమంతా అండగా ఉంటుందని ఆయన భావిస్తున్నారని టాక్. పైగా పాలకొల్లు నుంచి ఒకసారి మెగస్టార్ చిరంజీవీ పోటీచేసి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే అక్కడ్నుంచే తన ఫ్యామిలీలో ఒకరుగా భావిస్తున్న బన్నీని రంగంలోకి దింపాలని.. పెద్దలు నిర్ణయించారని సమాచారం. ముఖ్యంగా ఈ వ్యవహారం మొత్తమ్మీద టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పటికే పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2009 ఎన్నికల్లో ఓడిన మెగాస్టార్.. ఈసారి ఎట్టి పరిస్థితులలో పాలకొల్లు నుంచి జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆ కుటుంబం కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఓడిన పాలకొల్లును మెగా ఫ్యామిలీ ప్రిస్టేజ్‌గా తీసుకుని బన్నీవాస్‌ను బరిలోకి దింపుతోందని చెప్పుకోచ్చు.
2018 నుంచే బన్నీ.. బన్నీవాస్ ప్రారంభించేశారు..!
పాలకొల్లుకు పవన్ వస్తున్నాడంటే చాలు.. బన్నీవాస్ పేరిట ఓ రేంజ్‌లో ప్రత్యక్షమయ్యేవి. అయితే ఎన్నికల సీజన్ దగ్గరపడుతుండటంతో 2018లోనే పాలకొల్లులో పర్యటించడం గుళ్లు గోపురాల అభివృద్ధికి అటు బన్నీ.. ఇటు బన్నీ వాస్ ఇవ్వడం ఇవన్నీ పొలిటికల్ అరంగేట్రంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు మెగా కుటుంబంలో ఎవరు పాలకొల్లుకు వచ్చినా సరే.. ర్యాలీలు, రోడ్ షో, బ్యానర్లు, ఫ్లెక్సీలో ఓ రేంజ్‌లో దర్శనమిస్తుంటాయ్.. ఇవన్నీ చేసేది బన్నీవాసే. మరోవైపు బన్నీవాస్ అంటే పవన్‌కు ఇష్టమే. అంతేకాదు త్వరలో రాజమండ్రిలో జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకలకు గాను ఏర్పాట్ల బాధ్యతలను కూడా బన్నీవాస్‌కే పవన్ అప్పగించారు. దీన్ని బట్టి చూస్తే బన్నీకి పవన్‌కు టికెట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎంతైనా అల్లుఅరవింద్ రెకమెండేషన్ కదా.. టికెట్ ఇవ్వకపోతే ఎలా..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బన్నీకి పోటీగా టికెట్ కోసం..
పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుందని చెబుతుంటారు. ఇక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేను ఎదుర్కోవడం అంత సులువుకాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ్నుంచి జనసేన తరఫున పోటీ చేసేందుకు మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామయ్య జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే అటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ బోలెడంత ఉన్న ఆయనవైపు పవన్ మొగ్గుచూపుతారా..? లేకుంటే మెగా ఫ్యామిలీ మొత్తం అండగా ఉండే బన్నీవాస్‌కు పవన్ మొగ్గుచూపుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.