Nobel Prizes:భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరంచిన నోబెల్ బహుమతులు

  • IndiaGlitz, [Tuesday,October 03 2023]

2023 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ముగ్గురిని ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్త పెర్రీ అగోస్తిని, జర్మనీ శాస్త్రేవేత్త ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు నోబెల్ అవార్డు దక్కింది. అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడం, కాంతి తరంగాల ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ హన్స్ ఎలెగ్రెన్ తెలిపారు.

డిసెంబర్ 10న అవార్డులు ప్రదానం.. 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్ నగదు..

సోమవారం వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించగా ఇవాళ(మంగళవారం)భౌతిక శాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రంలో, గురువారం సాహిత్య విభాగంలో, శుక్రవారం శాంతి పురస్కారం విజేతలను ప్రకటిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డులు ప్రదానం చేస్తారు. అదే రోజు వారికి నగదును కూడా అందజేస్తారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్(9,86,000 డాలర్లు) ప్రైజ్ మనీ అందించనున్నారు.

స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో 1901లో నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటు..

2012లో 10 మిలియన్ క్రౌన్స్ నుంచి 8 మిలియన్ క్రౌన్స్‌కు ప్రైజ్ మనీని తగ్గించారు. అయితే 2017లో 9 మిలియన్ క్రౌన్స్ చేయగా.. 2020లో 10 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. ఇప్పుడు దానిని 11 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. 1896లో కన్నుమూసిన ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో 1901లో నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పురస్కారాలను ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా దీనిని పరిగణిస్తారు.