తెలుగు రాష్ట్రాల్లో విరిసిన పద్మాలు.. ఆసక్తికర విషయాలివే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు కాగా.. ముగ్గురు ఏపీకి చెందిన వారు. కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయికి చెందిన కనగరాజు పద్మశ్రీని దక్కించుకున్నారు. ఇక ఏపీలో ముగ్గురిని పద్మశ్రీ వరిస్తే వారిలో ఇద్దరు విజయవాడ వారే కావడం విశేషం. వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతి (దండమూడి సుమతీ రామ్మోహన్)లను పద్మశ్రీలు వరించాయి. వీరిద్దరూ పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించి, విజయవాడలో స్థిరపడ్డారు. అలాగే అనంతపురానికి చెందిన ప్రముఖ అవధాని, సీనియర్ సాహితీవేత్త డా. ఆశావాది ప్రకాశరావు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఇందిరాగాంధీ సమక్షంలో మొట్టమొదటిసారిగా...
కొమురంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక రాజు 1940లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి గుస్సాడీ నృత్యంపై మమకారం పెంచుకొని ఆ కళారూపం అంతరించి పోకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. ఆదివాసీల సంప్రదాయాలను ప్రతిబింబించే ఆ నృత్యాన్ని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో మొట్టమొదటిసారి ప్రదర్శించారు. ఆ తర్వాత అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా కొనసాగిన కాలంలో ఎర్రకోటలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తన బృందంతో ప్రదర్శన చేసి ప్రపంచానికి ఆదివాసీల నృత్యాన్ని పరిచయం చేశారు. ఆదివాసీ సామాజిక వర్గం నుంచి ఐఏఎస్‌గా పనిచేసిన మడావి తుకారం గుస్సాడీ నృత్యం అంతరించిపోకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరానికి కూడా రాజు ప్రత్యేక శిక్షకుడిగా వ్యవహరించారు. ఈయన శిక్షణలో వందలాది బృందాలు గుస్సాడీ నృత్యరూపకంపై మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాయి. గుస్సాడీ రాజుగా కనగరాజు సుపరిచితుడు. కాగా.. ఆయనకు థీంసా నృత్యంలోనూ ప్రావీణ్యం ఉంది.
గ్రంథ రచయితగా.. అవధానిగా..
డా. ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరివిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఫక్కీరప్ప. ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. తల్లి కుళ్లాయమ్మ. డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహు గ్రంథ రచయితగా, అవధానిగా, కవిగా పేరు గడించారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఆయన
భార్య వడుగూరు లక్ష్మీదేవి. తనకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ఆశావాది మాట్లాడుతూ.. జాతీయ భావాలను ప్రజల్లోకి చొచ్చుకువెళ్లేందుకు ఏవి అవసరమవుతాయో వాటిని తన జీవితంలో మలుపు తిప్పుకున్నానన్నారు. ప్రజలు, ప్రభుత్వం గుర్తించి తనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే భాష పట్ల అభిలాష సాహిత్య రంగానికి అంకితమయ్యానన్నారు. 50 సంవత్సరాలుగా సాహిత్య రంగంలో ఉంటూ 60 పుస్తకాలు... లెక్కలేనన్ని వ్యాసాలు రచించానని వెల్లడించారు.
బాలమురళీకృష్ణ కచేరీలకు వయోలిన్ సహకారం..
అన్నవరపు రామస్వామి తండ్రి పెద్దయ్య. తల్లి లక్ష్మి. ఆ తల్లిదండ్రులకు ఈయన ఎనిమిదో సంతానం. ఒకటో తరగతి వరకు చదివి తర్వాత ఆపేశారు. తరువాత పశువులను మేపుకుని వచ్చేవారు. ఆయన సంగీత శిక్షణ ఎనిమిదో ఏట ప్రారంభం కాగా, కచేరీల ప్రస్థానం 13వ ఏటనే ఆరంభమైంది. ఏలూరులోని జగన్నాథ చౌదరి అనే సంగీత విద్వాంసుడి వద్ద వయోలిన్ శిక్షణ పొందారు. తర్వాత సంగీత విద్వాంసుడు దాలిపర్తి పిచ్చయ్య సలహాతో విజయవాడలోని పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వద్ద శిష్యరికం చేశారు. ఆయన వద్ద ఎనిమిదేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు. రామకృష్ణయ్య పంతులు సంగీతం ఉచితంగానే నేర్పినా, రామస్వామి తిండికి ఇబ్బంది పడేవారు. సంగీతం నేర్చుకున్న సమయంలో అన్నం కోసం నాలుగేళ్లు ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పారు. బాలమురళీకృష్ణ కూడా ఈయనతోపాటే సంగీతం నేర్చుకున్నారు. ఆయన కచేరీలకు రామస్వామి వయోలిన్ సహకారం అందజేసేవారు. మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ విజయవాడ ఎప్పుడు వచ్చినా, అన్నవరపు రామస్వామి ఇంట్లోనే బస. ఇద్దరూ కలిసి అనేక దేశాల్లో కచేరీలు ఇచ్చారు. రామస్వామికి నాలుగుసార్లు కనకాభిషేకాలు జరిగాయి. వెండి కిరీటం, గండపెండేరాలతో రెండు సార్లు, బంగారు కంకణాలతో నాలుగుసార్లు సత్కరించారు. రామస్వామి షష్టిపూర్తి ఉత్సవాలకు కమిటీ చైర్మన్‌గా ఆయన ప్రాణమిత్రుడు బాలమురళీకృష్ణ వ్యవహరించారు.
దేశవిదేశాల్లో ప్రదర్శనలు...
నిడమోలు సుమతి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1950వ సంవత్సరంలో జన్మించారు. మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతి (దండమూడి సుమతీ రామ్మోహన్) తొలుత తండ్రి రాఘవయ్య వద్ద మృదంగం నేర్చుకున్నారు. తర్వాత విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో మృదంగ విద్వాంసుడు దండమూడి రామ్మోహనరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. రామ్మోహనరావుకు మంచి శిష్యురాలిగా ఉన్న సుమతి ఆయననే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. దేశవిదేశాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. పళని సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. రామ్మోహనరావు, సుమతి చాలాకాలం ఆకాశవాణి, దూరదర్శన్‌లో ‘ఏ’ గ్రేడ్ మృదంగ కళాకారులుగా ఉన్నారు. ఆమెకు మృదంగ విదుషి, మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, నాదభగీరథ, మృదంగలయ విద్యాసాగర వంటి బిరుదులు ఉన్నాయి. 1974, 1982, 1985 సంవత్సరాల్లో మద్రాసు సంగీత అకాడమీ నుంచి ఉత్తమశ్రేణి వాయిద్య కళాకారిణి అవార్డును అందుకున్నారు. 2009లో సుమతిని కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments