చంద్రబాబునే తికమకపెడుతున్న తోట బ్రదర్స్..!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం చంద్రబాబునే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అండ్ బ్రదర్స్ బురిడీ కొట్టించాలని చూస్తున్నారా..? పార్టీ మారమని చెబుతూనే లోలోపల అన్నీ సిద్ధం చేసేస్కుంటున్నారా..? ఇప్పటికే పార్టీమారిన వారి జాబితాలోకి తోట బ్రదర్స్ చేరుతారా..? ఫైనల్‌గా రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారా? అంటే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది.
తోట బ్రదర్స్ పార్టీ మారతారన్న వార్తలు ఇప్పుడ్నుంచి కాదో అప్పుడెప్పుడో 2017 నుంచే పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ పుకార్లు మరోసారి పుట్టుకొచ్చాయి. అంతా అయిపోయింది బ్రదర్స్ చేరికే ఆలస్యమని వార్తలు వచ్చిన నేపథ్యంలో త్రిమూర్తులు మీడియా ముందుకొచ్చి క్లారీటీ ఇవ్వడం జరిగింది. ఆ మరుసటి రోజే చంద్రబాబును త్రిమూర్తులు కలవడం.. ఆ తర్వాత రోజే ఎంపీ తోట నర్సింహులు కలిసి ఏకంగా బాబుకే కండిషన్స్ పెట్టారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయట్లేదని.. తన భార్యకు ‘జగ్గంపేట’ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ భేటీ జరిగిన మరుసటి రోజే జగ్గంపేట ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రూ.. చంద్రబాబును కలవడంతో అసలు రాజకీయం మొదలైంది. పైగా జ్యోతుల వైసీపీ తరఫున గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత. ఆయనకు ఈ సారి దాదాపు టికెట్ కన్ఫామ్ అయ్యిందని సమాచారం.
ఇవన్నీ అటుంచితే బుధవారం నాడు తోట త్రిమూర్తులు.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలవడం చర్చనీయాంశమైంది. అసలే త్రిమూర్తులు పార్టీ మారుతున్నారే వార్తలు వచ్చిన నేపథ్యంలో బాబుకు బద్ధ శత్రువైన తలసానిని కలవడంతో తెలుగుదేశం అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. వాస్తవానికి తోట బ్రదర్స్ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్నది జగమెరిగిన నిజం. బ్రదర్స్ ఇద్దరూ వస్తే రెండు టికెట్లు, మంత్రి పదవి కన్ఫామ్ అని వైసీపీ నుంచి పిలుపు వచ్చిన టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో తోట బ్రదర్స్.. తలసాని రాయబారంతో జగన్‌ను కలిస్తే బాగుంటుందని భావించి శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లుగా చంద్రబాబు శత్రువు తలసానిని కలిశారనే సమాచారం. అయితే జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత తోట బ్రదర్స్ వైసీపీలో చేరుతారా..? లేకుంటే టీడీపీలోనే కొనసాగుతారా అనే విషయంపై స్పష్టత రావాలంటే ఈ నెల 26వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout