మా స్కూల్స్‌తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు!

  • IndiaGlitz, [Monday,May 13 2019]

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి విద్యారంగంలోకి అడుగుపెట్టారని.. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున స్కూల్స్ ఏర్పాటు చేయాలని మెగా ఫ్యామిలీ భావించిందని కూడా కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మొదట స్కూల్స్ ప్రారంభం అవుతాయని వినపడింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ మెంబర్సే ఈ స్కూల్స్‌కు చైర్మన్, ఫౌండర్లని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కరపత్రాలు దర్శనమిచ్చాయి. అయితే ఈ వార్తలు విన్న మెగాభిమానులు అసలు ఈ వార్తలు నిజమో..? అబద్ధమో అర్థం కాని పరిస్థితి. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.

మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు..!

వార్తల్లో వచ్చినట్లుగా చిరంజీవిగానీ మెగా ఫ్యామిలీకి గాని ఆ స్కూల్స్‌తో ఎలాంటి సంబంధం లేదని విద్యాసంస్థ సీఈవో శ్రీనివాస్ రావు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మా పాఠశాలకు, మెగాస్టార్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంది. సేవా దృకథంతో, సామాజిక స్పృహతో ఈ విద్యా సంస్థను శ్రీకాకుళంలో ప్రారంభించామన్నారు. మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే చిరంజీవిని గౌరవ ఫౌండర్‌గా, రామ్ చరణ్‌ను గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబును గౌరవ చైర్మన్‌గా నియమించామని సీఈవో క్లారిటీ ఇచ్చేశారు. అంతేకానీ.. మా ఈ పాఠశాలకు, మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. పేద ప్రజలకు అత్యున్నత సౌకర్యాలతో ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు ఈ ప్రకటనలో ఆయన తెలిపారు. సో.. ఇకనైనా మెగా ఫ్యామిలీపై రూమర్స్ ఆగుతాయో లేకుంటే కంటిన్యూ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.