Pawan Kalyan: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు ఆ నలుగురిదే బాధ్యత: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారుల చేతే విచారణ చేయించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఘటనకు రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషన్, సీఎం భద్రతాధికారుల వైఫల్యమేనని జనసేనాని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి... చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు... చెట్లూ కొట్టలేదు.
ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చేయి... ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి’’ అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కాగా సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై దర్యాప్తునకు విజయవాడ సిటీ కమిషనర్ క్రాంతి రాణా 20 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments