జనసేన అభ్యర్థులను పరిశీలించేది ఈ ఐదుగురే..
- IndiaGlitz, [Sunday,February 03 2019]
2019 ఎన్నికల్లో 'జనసేన' సత్తా ఏంటో చూపాలని ముందుకెళ్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేశారు. తాజాగా ఐదుగురు సభ్యులతో జనసేన స్క్రీనింగ్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో సీనియర్ నేత మాదాసు గంగాధరం, పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అరహం ఖాన్, పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌కు చోటు దక్కింది. కాగా కమిటీ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకు వస్తున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని కూలంకషంగా పరిశీలించి ఆ వివరాలను పార్టీ జనరల్ బాడీ ముందు ఉంచనున్నారు. అనంతరం దరఖాస్తులను ఏ కోణంలో పరిశీలించి విశ్లేషించాలి అనే విషయమై ఐదు సూత్రాల నియామవళిని పవన్ రూపొంది కమిటీకి దిశా నిర్దేశం చేయడం జరిగింది. కాగా.. ఫిబ్రవరి రెండో వారం నుంచి విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ కమిటీ పని చేయడం ప్రారంభించనుంది.
కమిటీ విధి విధానాలు- మార్గదర్శకాలు..
లోక్‌సభ, శాసనసభలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థుల ప్రొఫైల్స్, వివరాలను, వారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించడం
అభ్యర్థిత్వాన్ని ఆశించేవారి వివరాలను పరిశీలించేందుకు మాత్రమే ఈ కమిటీ పనిచేస్తుంది.
అభ్యర్థిత్వానికి సంబంధించి నిర్ణయాధికారం ఈ కమిటీది కాదు
దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఎంపికకు ప్రమాణాల ప్రకారం వడపోత ప్రక్రియ చేపట్టడం
ఇవి పరిశీలిస్తారు..
గెలిచే సమర్థత
ఎన్నికల్లో పోరాడే శక్తి, ప్రత్యర్థిని ఎదుర్కొనే సమర్థత
ప్రజా సమస్యల పరిష్కారం పైనా, సామాజిక అంశాలపై స్పందన, నిబద్ధత ఈ ప్రమాణాల ప్రకారం వడపోత చేసిన తర్వాత అర్హులైన వారి వివరాలను జనరల్ బాడీకి కమిటీ అందజేస్తుంది.
సర్వేలు చేసిన తర్వాతే..!
స్క్రీనింగ్ కమిటీ నుంచి వచ్చిన అభ్యర్థుల వివరాలను జనరల్ బాడీ పరిశీలించి అనంతరం జనసేన తరఫున సర్వే బృందాలు ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేపట్టనున్నాయి. ఈ వివరాలన్నీ జనరల్ బాడీ ముందు ఉంటాయి. విజయం సాధించే అభ్ర్థులను గుర్తించి ఎంపిక చేయడమే ఏకైక లక్ష్యంగా జనసేన జనరల్ బాడీ విధులను నిర్వర్తిస్తుంది. ఈ ఎంపికకు అంతిమ బాధ్యత జనరల్ బాడీదే. అంతేకాదు కూటమిలో ఇచ్చే స్థానాలను సైతం ఇదే జనరల్ బాడీనే చూసుకోనుంది.
మొత్తానికి చూస్తే పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలకు గట్టిగానే ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీల నుంచి రాగా.. మరికొందరు రావడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇరు పార్టీల నుంచి కూడా త్వరలోనే కీలకనేతలు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.