Tholi Prema Review
ఫిదా సక్సెస్ తర్వాత వరుణ్ తేజ్ తదుపరి మూవీ ఎలా చేస్తాడోనని అందరూ అనుకున్నారు. వరుణ్ తేజ్ మరోసారి యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి పూర్తిస్థాయి లవ్ ఎంటర్‌టైనర్ చేయడానికి సిద్ధమయ్యాడు. అదీ కాకుండా ఈ సినిమాను కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. తొలిప్రేమ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే పవన్‌కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఆ సినిమాలా ఉంటుందో లేక టైటిల్ పెట్టి సినిమాను చెడగొడతారేమోనని కూడా అన్నారు. మరి ఈతరం తొలిప్రేమ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అని తెలుసుకోవడానికి కథేంటో చూద్దాం...
కథ:
ఆదిత్య(వరుణ్ తేజ్) లండన్ వీధుల్లో పరిగెట్టి అలసిపోయి.. ఓ చోట కూర్చొని తన కథను చెప్పడంతో సినిమా మొదలవుతుంది. చదువులో టాపర్ అయిన ఆదిత్య హైదరాబాద్ వెళ్లడానికి ట్రెయిన్ ఎక్కుతాడు. ఆ ట్రెన్‌లో వర్ష (రాశీ ఖన్నా)ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను చెప్పేస్తాడు. ఇద్దరూ ఇంజనీరింగ్ ఒకే కాలేజ్‌లో చేరుతారు. ఆదిత్య ప్రేమకు వర్ష గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో.. అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోతారు. చదువు ముగించుకున్న ఆదిత్య వర్షను మరచిపోవడానికి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. కంపెనీ అప్పగించిన ప్రాజెక్ట్ మేనేజర్‌గా వర్షను లండన్ వస్తుంది. ఆమెను చూసి ఆమెపై తన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు ఆదిత్య. అయినా కూడా వర్ష.. ఆదిత్యను ప్రేమిస్తుంటుంది. అసలు ఆదిత్య, వర్షపై కోపాన్ని ఎందుకు పెంచుకుంటాడు? ఆదిత్య కోపం తగ్గుతుందా? అసలు వర్ష చేసిన తప్పేంటి? ఇద్దరూ ఒకటవుతారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో రెండు పాత్రలు ఆదిత్య, వర్ష మధ్యనే సినిమా నడుస్తుంది. ఈ రెండు పాత్రల్లో వరుణ్ తేజ్, వర్షలు ఒదిగిపోయారు. మూడు టైమ్ ఫ్రేమ్స్‌లో రెండు పాత్రల మధ్య వేరియేషన్ చక్కగా ఎలివేట్ చేశారు. `ఫిదా` సినిమా కంటే ఈ సినిమాలో వరుణ్ తేజ్ చక్కగా నటించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో చక్కగా నటించాడు. ఇక రాశీ ఖన్నా పాత్రలో ఒదిగిపోయింది. పాత్ర కోసం బరువు తగ్గడమే కాదు.. చక్కటి హావభావాలను తెరపై చూపించింది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి లవ్‌స్టోరీలోని ఎమోషన్స్‌ను మిస్ కాకుండా సినిమాను చక్కగా ఎలివేట్ చేశాడు. ఫస్టాఫ్‌లో ప్రేమికుల మధ్య చక్కటి రొమాన్స్.. బ్రేకప్ కావడం.. అలాగే సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మెప్పిస్తాయి. తమన్ ట్యూన్స్ చాలా బావున్నాయి. ఇక నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. జార్జ్ విలియమ్స్ ప్రతి సీన్‌ను ఎంతో అందంగా తెరపై చూపించాడు.ఇక లండన్‌లో ఒకే కులం వ్యక్తులంటే పడిచచ్చే పాత్రలో సీనియర్ నరేష్, హీరో ప్రాణ స్నేహితుడుగా ప్రియదర్శి, బెట్టింగ్ రాజుగారిగా హైపర్ ఆది, ప్రియదర్శి లవర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి. పాత్ర చిన్నదే అయినా చివర్లో హీరో హీరోయిన్ కలయికకు కారణమయ్యే పాత్రలో సుహాసిని, ఇక కాలేజ్‌లో వరుణ్ తేజ్‌తో అక్క అంటూ పిలిపించుకుని.. కామెడీ క్రియేట్ చేసే పాత్రలో విద్యుల్లేఖా రామన్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
ఇందులో మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా చెప్పుకునేలా లేవు. సన్నివేశాలను లాగి సెకండాఫ్‌ను రన్ చేయించినట్టు కనపడుతుంది. పవన్‌కల్యాణ్ తొలిప్రేమతో పోల్చుకుని మాత్రం ఈ సినిమాకు రాకూడదు. ఆ సినిమాలో క్లైమాక్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ ఈ తొలిప్రేమలో క్లైమాక్స్ రొటీన్ లవ్‌స్టోరీస్‌లానే ఉంది.
సమీక్ష:
జ్ఞాపకాలు చెడ్డవో, మంచివో మరుగున పడిపోయి ఉంటాయి. వాటిని మోయాల్సిందే తప్పదు. దేవుడికే కులం లేదు. మరి మన మనుషుకెందుకో.. అనే డైలాగ్స్ బావున్నాయి. కమర్షియల్ సినిమాలకు సంగీతం వాయించే తమన్ క్యూట్ లవ్‌స్టోరీకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎన్‌హెన్స్ చేసింది. ప్రేమకథలో ప్రేమించుకోవడం, విడిపోవడం.. మళ్లీ కలుసుకోవడం అనే కాన్సెప్ట్‌పైనే సినిమాను రన్ చేశారు. సినిమాలో సన్నివేశాల పరంగా వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ సీన్స్ అలరిస్తాయి. సెకండాఫ్‌లో హైపర్ ఆది కామెడీ అలరిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజ్ సన్నివేశాలు హీరో, హీరోయిన్ మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు, సెకండాఫ్‌లో నడిచే ఎమోషనల్ బ్లాగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మొత్తంగా పవన్‌కల్యాణ్ తొలిప్రేమ అనే టైటిల్‌తో వచ్చిన ఈ తరం తొలిప్రేమ.. యూత్.. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుదనడంలో సందేహం లేదు.
బోటమ్ లైన్: తొలిప్రేమ... లవ్..బ్రేకప్...లవ్
Tholi Prema Movie Review in English
- Read in English