ఈసారి ఖైరతాబాద్ గణపతి ఒక్క అడుగే..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు భారీగా క్యూలైన్లు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఆశించినంతగా జనం రాలేరేమో.. ఎందుకంటే కరోనా భయం నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏడాది అడుగులు పెంచుకుంటూ వెళ్లే ఉత్సవ కమిటీ.. ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్కటంటే ఒక అడుగు ఎత్తులోనే గణపయ్య విగ్రహం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదే జరిగితే చరిత్రలో ఫస్ట్ టైమ్..!
కాగా.. ఈ నెల 18న సాయంత్రం 5గంటలకు కర్రపూజ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 22న వినాయక చవితి జరగనుంది. అయితే కర్ర పూజ రోజునే వినాయకుడి ఎత్తుపై కమిటీ ప్రకటన చేస్తుందని తెలియవచ్చింది. 1954లో తొలిసారిగా ఖైరతాబాద్ గణేష్ కొలువుదీరిన విషయం విదితమే. తొలిసారి కావడంతో అప్పుడు ఒకే ఒక్క అడుగు ఎత్తుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏడాదికి ఒక అడుగు చొప్పున వినాయకుడి ఎత్తును పెంచుతూ వచ్చారు. అలా 60 ఏళ్లు వచ్చేసారికి ఖైరతాబాద్ గణనాథుడి ఎత్తు 60 అడుగులకు చేరింది. గతేడాది 61 అడుగుల ఎత్తులో ఏర్పాటయ్యింది. ఇదిలా ఉంటే.. కోటి రూపాయలతో రూపుదిద్దుకున్న గణేశుడి కోసం 100 మందికి పైగా కళాకారులు నాలుగు నెలలు కష్టపడి తయారు చేస్తుంటారు. ఒక్క అడుగు అనేది నిజమే అయితే.. చరిత్రలో ఇదే తొలిసారి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారికంగా ఉత్సవ కమిటీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments