ఇది ఇక్కడితో ఆగదు.. పిచ్చా.. శని అనుకోవాలా!?
- IndiaGlitz, [Thursday,August 22 2019]
పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం విదితమే. టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలన్న నవయుగ సంస్థ పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుంది..? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఇది ఇక్కడితో ఆగదు!
ఇది ఇక్కడితో ఆగదు.. జాప్యం ప్రభావం ప్రాజెక్ట్ పై పడుతుంది. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా..? రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్ధం కావడం లేదు. పోలవరం తో ప్రయోగాలు వద్దని మేము ముందు నుంచి చెబుతున్నాం. జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్ట్‌కు నష్టం వాటిల్లుతుంది. కేంద్రం కూడా పదే పదే చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్ధం కావట్లేదు. లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. టెండర్ల విషయంలో గడ్కరీ ఎన్నో సార్లు వద్దు అని చెప్పారు. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గురువారం నాడు కోర్టు తీర్పు అనంతరం అమరావతిలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇంకా వైసీపీ నేతలు రియాక్ట్ అవ్వలేదు. వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అయితే రాష్ట్ర, కేంద్ర కమలనాథులు ఏమంటారో చూడాలి.