Janasena: ఈసారి జనసేన ముద్ర బలంగా ఉంటుందంట.. ఎన్ని స్థానాల్లో గెలుస్తుందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. కనీసం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టలేకపోయారు. అందుకే ఈసారి మాత్రం కచ్చితంగా తాను అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు తన పార్టీకి ప్రాధాన్యత దక్కేలా పవన్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లారు. టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికలకు వెళ్లారు. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో పోటీకి దిగారు. సీట్లు తక్కువ తీసుకున్నా సరే.. తీసుకున్న సీట్లలో 100శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా చూసుకుంటామని చెప్పారు.
అంటే జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కార్యాచరణ సాధించారు. టీడీపీ క్యాడర్‌తో సమన్వయం చేసుకుంటూ పోలింగ్‌కు వెళ్లారు. దీంతో పవన్ అనుకున్న లక్ష్యం నెరవేరే దిశగా అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులతో పాటు జనసేన నేతలు కూడా చెబుతున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఈసారి రెండంకెల సీట్లు రావడంతో పాటు తొలిసారి జనసేనాని శానససభలోకి కాలుమోపుతున్నారన్నారన్న సర్వేల ఫలితాలు క్యాడర్‌లో మరింత జోష్ పెంచేశాయి.
2014 ఎన్నికల్లో జనసేన పార్టీ ఉన్నప్పటికీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతి ఇచ్చింది. పోటీ చేయకపోవడంతో ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం లేకుండా పోయింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీతో విభేదించి సొంత కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీ చేయడంతో పవన్ కల్యాణ్‌తో పాటు అందరూ ఓటమి పాలయ్యారు. కేవలం రాజోలు నుంచి మాత్రమే ఒకే ఒక్కరు గెలిచారు. గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరిపోయారు. దీంతో అసెంబ్లీలో జనసేన ప్రాధాన్యత లేకుండా పోయింది.
అయితే ఈసారి కూటమిగా మరోసారి పోటీకి దిగడంతో జనసేన పార్టీ ఈసారి ఎన్నికలలో అసెంబ్లీలోకి ఠీవిగా అడుగుపెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 12 నుంచి 15 స్థానాలను కైవసం చేసుకుంటామని జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంటే 80శాతం మంది జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని తమ అంతర్గత సర్వేల ద్వారా తెలిసిందని చెప్పుకొచ్చారు. అందులోనూ బరిలో దిగిన ముఖ్యమైన నేతలందరూ గెలవడం ఖాయమని సర్వేల్లో వెల్లడయినట్లు తెలిసిందన్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీ రాకపోయినా ఓ రకమైన మెజార్టీతోనైనా గెలుస్తారనే ధీమాలో ఉన్నారు. దీంతో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ శాసనసభలోకి సగర్వంగా అడుగు పెడతారని అంటున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. మరి జనసైనికులు అంచనా వేస్తున్నట్లు అన్ని స్థానాల్లో గెలుస్తారో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments