Vangaveeti Radha: వంగవీటి వారసుడికి ఇదేం దుస్థితి..? స్వయంకృతాపరాధమేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
వంగవీటి రంగా ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. కృష్ణా జిల్లాలో వంగవీటి కుటుంబం అంటే ఇప్పటికీ ఎనలేని ఆదరణ ఉంది. కాపు నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రంగా.. తన సామాజిక వర్గంతో పాటు పేదల పక్షాన పోరాటం చేశారు. ఆయన చేసిన సేవలను తరాలు మారినా తలుచుకునే ఉంటారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి రంగా అంటే ఓ క్రేజ్ ఉంది. ప్రతి జిల్లాలో ఆయన విగ్రహం ఉంటుందంటే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కాపు యువత అయితే ఆయనను తమ రోల్ మోడల్‌గా భావిస్తారు.
అలాంటి వంగవీటి రంగా తనయుడు రాధా మాత్రం అంత పేరు తెచ్చుకోలేకపోతున్నారు. వంగవీటి వారసుడిగా రాధాకు కూడా మంచి ఇమేజ్ ఉంది. కానీ ఆయన దానిని సరిగ్గా వినియోగించుకోలేకపోయారనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే రంగా కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా ఇప్పటివరకు తనకుంటూ సరైన పేరు తెచ్చుకోలేకపోయారు. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాధా.. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014లో వైసీపీ తరపున పోటీ చేసి మరోసారి పరాజయం పొందారు. కానీ వైసీపీలో తనకు ఆదరణ దొరకడం లేదని 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు.
అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా ప్రచారం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాధా సైలెంట్ అయిపోయారు. పార్టీలో ఉన్నారనే కానీ ఏ రోజు ఆయన పార్టీ తరపున కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అసలు రాధా టీడీపీలో ఉన్నారనే సంగతే చాలా మందికి తెలియదు. తొలి నుంచి కూడా రాజకీయాల్లో రాధా వైఖరి వంగవీటి అభిమానులకు మింగుడు పడటం లేదు. బలమైన రాజకీయ వారసత్వం ఉన్నా కూడా దానిని నిలబెట్టుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారనే చర్చ బెజవాడలో వినిపిస్తూ ఉంటుంది.
రాజకీయ నాయకుడిగా రాణించాలనుకునే వారు పదవిలో ఉన్నా లేకపోయినా నిత్యం జనాల మధ్యలో ఉండాలి. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా పోరాటం చేయాలి. అప్పుడే ఆ నాయకుడికి పార్టీల మద్దతుతో పాటు ప్రజల మద్దతు ఉంటుంది. కానీ రాధా మాత్రం ప్రజల్లో తిరగరు. ప్పుడో ఓసారి బయటకు వస్తూ ఉంటారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే విజయవాడ వేదికగా ఒకప్పుడు వంగవీటి రంగా రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపారు. వంగవీటి ప్రత్యర్థి వర్గమైన దేవినేని నెహ్రు, గాంధీ, మురళీ లేకపోయినా వారి వారసత్వం బలంగా ఉంది. దేవినేని వారసులుగా ప్రస్తుతం దేవినేని ఉమా, దేవినేని చందూ టీడీపీలో కొనసాగుతుండగా.. దేవినేని అవినాష్ మాత్రం వైసీపీలో ఉన్నారు. ఇక దేవినేని ఉమా అయితే మంత్రిగా కూడా పనిచేశారు.
కానీ వంగవీటి కుటుంబం నుంచి సరైన వారసత్వం లేదు. రంగా వారసుడిగా రాధా ఉన్నారనే కానీ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఏ పార్టీ నుంచి టికెట్ దక్కించుకులేని స్థితిలో ఉన్నారు. టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నుంచి టికెట్ ఇద్దామనుకుంటే ప్రజల్లో ఎక్కడా తిరగలేదు. దీంతో రాధాను పక్కనబెట్టారు. వైసీపీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలన్నా ఆయనకు అక్కడ ఛాన్స్ లేదు. ఇక జనసేన నుంచి టికెట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ను కలిసి చర్చించారు. అలాగే మచిలీపట్నం ఎంపీ బాలశౌరితోనూ భేటీ అయి మంతనాలు జరిపారు. వంగవీటి పేరుకు ఉన్న పేరు దృష్ట్యా పార్టీలే ఇంటికి వచ్చి టిక్కెట్లు ఇవ్వాల్సి ఉండగా.. రాధా మాత్రం నేతల వద్దకు పరుగులు తీయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. కృష్ణా జిల్లా అవనిగడ్డ పొత్తులో భాగంగా జనసేన ఖాతాలోకి వెళ్లింది. దీంతో అక్కడి నుంచి రాధా పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మరి జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి వంగవీటి వారసత్వాన్ని నిలబడతారా...? లేదంటే ఇలాగే రాజకీయ శూన్యత్వం ఉన్న నాయకుడిగా మిగిలిపోతారా..? అనేది వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com